పూతలపట్టు నియోజకవర్గంలో ముమ్మర లాబీయింగ్ బరిలో ముగ్గురు మహిళా జెడ్పీటీసీలు.. ఎవరికి వారే ధీమా సీనియర్లకు పట్టం కట్టాలంటూ మరో వర్గం డిమాండ్ ఈ నెల 20న జెడ్పీ చైర్‌పర్సన్ ఎన్నిక, ప్రమాణ స్వీకారం
జిల్లా పరిషత్ పీఠం ఎవరిని వరిస్తుందనే దానిపై జిల్లావ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 20వ తేదీన జెడ్పీ చైర్‌పర్సన్ ఎన్నిక, ప్రమాణ స్వీకారం చేపట్టనున్నారు. ఈ క్రమంలో జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎన్నికకు మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇక జెడ్పీ పీఠం పూతలపట్టు నియోజకవర్గం చుట్టూ తిరుగుతుండడంతో నాయకులు ముమ్మర లాబీయింగ్ చేస్తున్నారు.
కాణిపాకం: జిల్లాల పునర్విభజన తర్వాత తొలిసారి జిల్లా పరిషత్‌కు ఎన్నికలు జరిగాయి. ఈ సారి జెడ్పీ పీఠం మహిళకు కేటాయించారు. ఈ క్రమంలో పూతలపట్టు నియోజకవర్గానికే పీఠం దక్కుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. జిల్లా రాజకీయ సమీకరణాల నేపథ్యంలో, ఈ నియోజకవర్గానికి చెందిన ముగ్గురు మహిళా జెడ్పీటీసీలు చైర్‌పర్సన్ కుర్చీ కోసం తీవ్రంగా పోటీపడుతున్నారు. పూతలపట్టు జెడ్పీటీసీగా గెలుపొందిన శైలజ, బంగారుపాళ్యం మండలానికి చెందిన మమతశ్రీ (గుడిపాల జెడ్పీటీసీగా బరిలో నిలిచి విజయం సాధించారు), అలాగే బంగారుపాళ్యం మండల జెడ్పీటీసీ సుచిత్ర అధిష్టానం వద్ద ఎవరికి వారు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్య నేతల ద్వారా లాబీయింగ్ చేస్తూ అధిష్టానం ఆశీస్సుల కోసం ఎదురుచూస్తున్నారు.
ఎవరి వాదన వారిదే..
జెడ్పీ చైర్‌పర్సన్ ఎంపిక విషయంలో ఆయా వర్గాల నేతలు ఎవరికి వారు తమ అభ్యర్థులకే అవకాశం దక్కుతుందని బలంగా వాదిస్తున్నారు. ఒకవైపు పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడి పనిచేస్తున్న సీనియర్లకు ఈసారి అవకాశం కల్పించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. బంగారుపాళ్యం మండలానికి చెందిన మమతశ్రీని ప్రత్యేకించి పక్క మండలమైన గుడిపాల జెడ్పీటీసీ బరిలో నిలిపి గెలిపించుకున్నదే జెడ్పీ పీఠం కోసమని, లేకపోతే ఆమెను అక్కడ పోటీ చేయించాల్సిన అవసరం ఏముందని ఆ వర్గం నేతలు ప్రశ్నిస్తున్నారు. అధిష్టానం కచ్చితంగా మమతశ్రీ వైపే మొగ్గు చూపుతుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క, స్థానికంగా బలమైన నేతగా ఉన్న పూతలపట్టు జెడ్పీటీసీ శైలజకే జెడ్పీ కుర్చీ కేటాయిస్తారని, ఇప్పటికే అధిష్టానం నుంచి సంకేతాలు అందాయని ఆమె అనుచరులు ప్రచారం చేస్తున్నారు. ఇక బంగారుపాళ్యం జెడ్పీటీసీ సుచిత్ర వర్గం సైతం తామేమీ తక్కువ కాదన్నట్లుగా ప్రయత్నాలు సాగిస్తోంది. దీంతో త్రిముఖ పోటీ మరింత రసవత్తరంగా మారింది. మొత్తానికి పూతలపట్టు నియోజకవర్గానికి చెందిన ఈ ముగ్గురు మహిళా నేతల్లో జిల్లా ప్రథమ పౌరురాలి పీఠంపై ఎవరు కూర్చుంటారోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.


