బాలల భద్రత అందరి బాధ్యత
చిత్తూరు కలెక్టరేట్ : చెడు ప్రవర్తన కలిగిన వారికి దూరంగా ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి ఎంవీఎన్ పద్మజ విద్యార్థులకు పిలుపునిచ్చారు. పోక్సో చట్టం 2012పై దేశవ్యాప్త పాఠశాల స్థాయి అవగాహన ప్రచార కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు సోమవారం నగరంలోని బీవీరెడ్డి పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీనియర్ సివిల్ జడ్జి ఎంవీఎన్ పద్మజ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. పిల్లలు చెడుగా ప్రవర్తించే వారి పట్ల ధైర్యంగా ‘నో’ చెప్పాలని ఆమె సూచించారు. బాలలపై జరిగే లైంగిక నేరాలను అరికట్టడం, బాలల హక్కులను పరిరక్షించడం, సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యంగా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ‘‘సురక్షిత బాల్యం, బాలల రక్షణ ఉద్యమం’’ పేరుతో పాఠశాల స్థాయిలో ఈ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి బాలుడు, బాలిక తమ హక్కులను తెలుసుకోవడంతో పాటు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ మధ్య తేడాను స్పష్టంగా గుర్తించాలన్నారు. ఏదైనా వేధింపులు ఎదురైనప్పుడు విద్యార్థులు భయపడకుండా వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులకు ధైర్యంగా తెలియజేయడం ఎంతో ముఖ్యం అని చెప్పారు. బాలలపై జరిగే లైంగిక వేధింపుల స్వరూపం, వాటిని గుర్తించే విధానం, బాధిత పిల్లలకు అందుబాటులో ఉన్న చట్టపరమైన రక్షణలు, ఫిర్యాదు చేసే పద్ధతులపై అవగాహన ముఖ్యమన్నారు. పోక్సో చట్టం ప్రకారం 18 సంవత్సరాల లోపు పిల్లలను రక్షించడానికి కఠినమైన చట్టపరమైన చర్యలు ఉన్నాయన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఇలాంటి పాఠశాల స్థాయి అవగాహన కార్యక్రమాలతో విద్యార్థులు, ఉపాధ్యాయులు సమాజంలో బాలల రక్షణ పట్ల బాధ్యతను పెంపొందించేందుకు నిరంతరం చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ‘‘బాలల భద్రత మనందరి బాధ్యత, ప్రతి బాల్యాన్ని సురక్షితంగా కాపాడుదాం’’ అని ఆమె పిలుపునిచ్చారు. ఈ న్యాయ విజ్ఞాన సదస్సులో ఎంఈవో2 మోహన్, పాఠశాల ప్రిన్సిపాల్ కౌసల్య, స్కూల్ అడ్మినిస్ట్రేటర్ వనసుందరి తదితరులు పాల్గొన్నారు.
మాతా, శిశు మరణాల నివారణకు ఏఎన్‌ఎంలు కీలకం
చిత్తూరు రూరల్ (కాణిపాకం): మాతా, శిశు, నవజాత శిశువుల మరణాలను నివారించి, వారి ఆరోగ్య సంరక్షణను మెరుగుపరిచేందుకు క్షేత్రస్థాయిలో ఏఎన్‌ఎంల పాత్ర అత్యంత కీలకమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి నాగ శశిభూషణ్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం చిత్తూరు నగరంలోని డీఎంఅండ్‌హెచ్‌వో కార్యాలయంలో అర్మాన్ (అడ్వాన్సింగ్ రిడక్షన్ ఇన్ మోర్టాలిటీ అండ్ మార్బిడిటీ ఆఫ్ మదర్స్, చిల్డ్రన్ అండ్ నియోనేట్స్) సంస్థ ఆధ్వర్యంలో మొదటి బ్యాచ్ ఏఎన్‌ఎంలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ.. జిల్లాలోని ఏఎన్‌ఎంలందరికీ బ్యాచ్‌ల వారీగా రెండేసి రోజుల పాటు శిక్షణ ఉంటుందన్నారు. గర్భిణులకు సకాలంలో ఆరోగ్య సూచనలు అందించడం, ప్రమాదకర గర్భధారణ కేసులను ముందుగానే గుర్తించడం, గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోషకాహార ప్రాముఖ్యత, నవజాత శిశువుల సంరక్షణ తదితర అంశాలపై ఈ కార్యక్రమంలో పూర్తిస్థాయి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఈ నెల 15 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్న జాతీయ నవజాత శిశువుల ఆరోగ్యం, సంరక్షణ వారోత్సవాల అవగాహన బ్యానర్‌ను డీఎంహెచ్‌వో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్షయ నివారణ అధికారి వెంకటప్రసాద్ పాల్గొన్నారు.


