శిక్షణను సద్వినియోగం చేసుకోండి | - | Sakshi
Sakshi News home page

శిక్షణను సద్వినియోగం చేసుకోండి

Nov 17 2026 1:08 AM | Updated on Nov 17 2026 1:08 AM

నేర్చుకున్న అంశాలను పక్కాగా అమలు చేయాలి జనగణన సమాచార సేకరణలో తప్పులకు తావుండకూడదు ఫీల్డ్‌ ట్రైనర్ల శిక్షణలో డీఆర్‌వో మోహన్‌ కుమార్‌ వెల్లడి

చిత్తూరు కలెక్టరేట్‌ : శిక్షణలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేయాలని డీఆర్‌వో మోహన్‌ కుమార్‌ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో రెండో దశ జనగణన నిర్వహణకు సంబంధించి ఫీల్డ్‌ ట్రైనర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాస్థాయి అధికారులకు నవంబర్‌ 16 నుంచి 18 వరకు మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ శిక్షణ కార్యక్రమానికి డీఆర్‌వో ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. డీఆర్‌వో మాట్లాడుతూ జనగణన నిర్వహణపై మూడు రోజుల పాటు అందించే శిక్షణను అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శిక్షణలో వివరించే ప్రతి అంశాన్ని శ్రద్ధగా విని, ముఖ్యమైన విషయాలను నమోదు చేసుకోవాలని చెప్పారు. ఎలాంటి సందేహాలు ఉన్నా మాస్టర్‌ ట్రైనర్లను అడిగి వెంటనే నివృత్తి చేసుకోవాలని తెలిపారు. శిక్షణ పూర్తయ్యే సమయానికి ప్రతి ఒక్కరికీ జనాభా గణన ప్రక్రియపై పూర్తి అవగాహన ఉండాలని స్పష్టం చేశారు. జనాభా లెక్కింపులో సేకరించే గణాంకాలు దేశ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో అభివృద్ధి ప్రణాళికలు, సంక్షేమ కార్యక్రమాల రూపకల్పనకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. అందువల్ల సమాచార సేకరణలో ఖచ్చితత్వం, విశ్వసనీయతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జనాభా లెక్కింపు ప్రక్రియలో అనుసరించాల్సిన విధివిధానాలు, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన చర్యలు, అధికారుల బాధ్యతలు, సాంకేతిక అంశాలపై ప్రతి ఒక్కరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని తెలిపారు. జనగణన కార్యక్రమం విజయవంతం కావడంలో జిల్లా, చార్జ్‌ స్థాయి అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయం ఎంతో కీలకమని తెలిపారు.

డిసెంబర్‌ నెలలో శిక్షణా కార్యక్రమాలు

డిసెంబర్‌ నెలలో ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లకు శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించి, నెలాఖరులోగా పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు డీఆర్‌వో తెలిపారు. అందుకు అనుగుణంగా ఫీల్డ్‌ ట్రైనర్లు ఇప్పటి నుంచే సిద్ధమై, తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు మునిచంద్ర, లక్ష్మీ, జనాభా గణనకు సంబంధించిన మాస్టర్‌ ట్రైనర్లు, ఫీల్డ్‌ ట్రైనర్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement