రాజీనామా పత్రం తీసుకోకుండా వేధిస్తున్నారంటూ ఐసీడీఎస్ పీడీకి ఫిర్యాదు రాజకీయ ఒత్తిళ్లతోనే అధికారులు జాప్యం చేస్తున్నారని ఆవేదన కలెక్టర్ న్యాయం చేయాలంటూ నంజమ్మ వేడుకోలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని బైరెడ్డిపల్లి మండలం, మోగనపల్లి పంచాయతీ పరిధిలోని ఆలప్పపల్లి అంగన్‌వాడీ సహాయకురాలిగా (హెల్పర్)గా నంజమ్మ విధులు నిర్వహిస్తున్నారు. ఆమె పంచాయతీ ఎన్నికల్లో ఆలప్పపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి పోటీచేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు తన అంగన్‌వాడీ హెల్పర్ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధపడగా, సంబంధిత అధికారులు తన రాజీనామా పత్రాన్ని ఆమోదించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ మేరకు ఆమె సోమవారం కలెక్టరేట్‌లో ఐసీడీఎస్ పీడీకి ఫిర్యాదు చేశారు. పీడీని కలిసి తన రాజీనామా పత్రాన్ని తక్షణమే ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. అయితే, నిబంధనల ప్రకారం బైరెడ్డిపల్లి సీడీపీవోకే రాజీనామా పత్రాన్ని అందజేయాలని పేర్కొంటూ పీడీ సైతం పత్రాన్ని స్వీకరించకపోవడంతో ఆమె తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అనంతరం కలెక్టరేట్‌లో నిరసన చేపట్టారు.
రాజకీయ ఒత్తిళ్ల వల్లే అడ్డుకుంటున్నారు
ఈ మేరకు నంజమ్మ మాట్లాడుతూ.. గ్రామంలో తనకు ప్రజాదరణ ఉందన్నారు. సర్పంచ్‌గా పోటీ చేస్తే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో పంచాయతీలోని కొందరు వ్యక్తులు జీర్ణించుకోలేకపోతున్నారని ఆరోపించారు. తాను పోటీకి దూరంగా ఉండేలా చేసేందుకు వారంతా ఏకమై సీడీపీవోపై రాజకీయ ఒత్తిడి తెచ్చి తన రాజీనామా పత్రాన్ని అంగీకరించకుండా అడ్డుకుంటున్నారని వాపోయారు. నామినేషన్ల ప్రక్రియకు సమయం ముంచుకొస్తున్న తరుణంలో అధికారులు ఇలా ఇబ్బంది పెట్టడం తగదన్నారు. కలెక్టర్ తక్షణమే ఈ విషయంలో జోక్యం చేసుకుని, తన రాజీనామాను ఆమోదించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేసి న్యాయం చేయాలని నంజమ్మ విజ్ఞప్తి చేశారు.


