జిల్లావ్యాప్తంగా పటిష్ట పోలీస్ బందోబస్తు సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు జిల్లా పోలీస్ శాఖ హెచ్చరిక
చిత్తూరు రూరల్ (కాణిపాకం): గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు చిత్తూరు జిల్లా పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేయడంతో పాటు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ డ్రోన్లతో విస్తృత నిఘా పెట్టారు. నామినేషన్ కేంద్రాల పరిసర ప్రాంతాలు, జనసమ్మర్దం ఎక్కువగా ఉండే చోట్లు, ముఖ్యంగా సమస్యాత్మక గ్రామాలపై డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ముందస్తు జాగ్రత్తగా ప్రత్యేక బలగాలను రంగంలోకి దించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు.. ఎన్నికల నిబంధనలను ప్రతి ఒక్కరూ తూ.చ. తప్పకుండా పాటించాలని జిల్లా పోలీస్ శాఖ స్పష్టం చేసింది. నామినేషన్ల ప్రక్రియకు ఆటంకం కలిగించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడినా ఉపేక్షించేది లేదని, అటువంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ సాగేందుకు ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరించాలని విజ్ఞప్తి చేసింది.
డ్రోన్‌లతో పోలీసుల నిఘా


