గంగినాయనపల్లె వద్ద పొలాల్లోనే వదిలేసిన చామంతి
గంగినాయనపల్లె వద్ద ఎండిపోయిన చామంతి
బైరెడ్డిపల్లె : దసరా, దీపావళి పండుగల్లో ధరలు పెరిగి లాభాలు వస్తాయని ఆశించిన రైతుల ఆశలు అడియాసలయ్యాయి. ఇటీవల వర్షాలు కురవడంతో పూలపై మచ్చలు ఏర్పడడంతో కొనుగోలు చేయడానికి వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు. దీంతో రైతులు పొలాల్లోనే వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేజీ పూలు కోయడానికి రూ.25ల వరకు ఖర్చు వస్తోందని, మార్కెట్‌కు తరలిస్తే రూ.20 కూడా అమ్ముడుపోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు ఆశించిన మేరకు ధరలు లేకపోవడంతో తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. పూల సాగుకు ఎకరాకు కనీసం రూ.50 వేల వరకు పెట్టుబడి అవుతుందని, పెట్టుబడి కూడా రాకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయామని రైతులు ఆరోపిస్తున్నారు.


