చిత్తూరు శివారులోని కళాశాలపై
మళ్లీ పుకార్లు
విద్యార్థిని ఆత్మహత్య పేరుతో
జోరుగా ప్రచారం
తల్లిదండ్రులను కాలేజీ యాజమాన్యం డబ్బుతో సర్దుబాటు చేసిందని వదంతులు
ఇవన్నీ అసత్యమని కొట్టిపారేసిన పోలీసులు
కళాశాలలో ఫీజుల వేధింపులపై
విద్యార్థుల ఆగ్రహం
కన్వీనర్ కోటా వారికి రూ.వేలల్లో
జరిమానాలు విధిస్తున్నారని ఆరోపణ
ఆందోళనకు దిగిన విద్యార్థి సంఘాల నేతలు అరెస్ట్
విద్యార్థులతో కలెక్టర్ సమీక్ష
సాక్షి టాస్క్ఫోర్స్: చిత్తూరు నగర శివారులోని ఓ ఇంజినీరింగ్ కళాశాల మరోసారి వివాదాలకు కేంద్రబిందువైంది. కళాశాలలో ఫీజు వేధింపులు తారస్థాయికి చేరడంతో విద్యార్థుల్లో రగులుతున్న అసంతృప్తి రకరకాల పుకార్లకు దారితీస్తోంది. శుక్రవారం ఉదయం నుంచి కళాశాలకు చెందిన ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందంటూ సోషల్ మీడియాలో వదంతులు వ్యాపించాయి. కళాశాల రెండో అంతస్తులో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని మృతదేహాన్ని బాత్రూమ్లో దాచిపెట్టారని, అనంతరం వెనుక వైపు ఉన్న ప్రహారీ గోడను పగలగొట్టి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారని కొందరు మీడియాకు ఫోన్లు చేసి ప్రచారం చేశారు. సామాజిక మాధ్యమ వేదికగా ఓ ఏఐ ఫొటో ను వైరల్ చేయించారు. అంతేకాకుండా మృతురాలి తల్లిదండ్రులకు యాజమాన్యం భారీగా డబ్బు ముట్టజెప్పి వ్యవహారాన్ని సర్దుబాటు చేసిందనే వదంతులు కూడా వ్యాపించాయి.
పుకార్లని కొట్టిపారేసిన పోలీసులు
ఈ ప్రచారంపై రంగంలోకి దిగిన పోలీసులు విచారణ జరిపి అవన్నీ శుద్ధ అబద్ధాలని తేల్చిచెప్పారు. ఒకవేళ ఎవరైనా చనిపోతే మృతదేహాన్ని బాత్రూమ్లో దాచిపెట్టడం ఎలా సాధ్యమని, ఎన్ని రోజులు దాచగలరని పోలీసులు చెబుతున్నారు. మరణించి ఉంటే కనీసం ఫైల్ ఫొటో గానీ, వీడియో గానీ ఉండాలి కదా అని వివరిస్తున్నారు. కళాశాలలో ఉన్న ఫీజుల సమస్యపై యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చేందుకే కొందరు విద్యార్థులు ఇలా ఓ విద్యార్థిని పేరు ను తెరపైకి తెచ్చి అసత్య ప్రచారం చేశారని స్పష్టం చేశారు.
సమీక్షించిన కలెక్టర్
కళాశాల యాజమాన్య తీరును నిరసిస్తూ శుక్రవారం కాలేజీ ఎదుట ఆందోళనకు దిగిన విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యవహారం తీవ్రం కావడంతో కలెక్టర్ స్పందించారు. పది మంది విద్యార్థులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. శనివారం కళాశాల యాజమాన్యంతోనూ సమావేశ మై చర్చించనున్నారు. కాగా, గురువారం ఇదే కళాశాలలో జరిగిన విద్యార్థుల ఆందోళనపై సీఎంఓ కూడా ఆరా తీసినట్లు తెలిసింది. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను సకాలంలో చెల్లించకపోవ డం వల్లే ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రభుత్వం స్పందించి నిధులు విడుదల చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
భగ్గుమంటున్న విద్యార్థులు
మరోవైపు కళాశాలలో పరిస్థితులపై ఆరా తీస్తే ప్రతి విద్యార్థి నోటా ఫీజు వేధింపుల మాటే వినిపిస్తోంది. కన్వీనర్ కోటా కింద సీట్లు పొందిన విద్యార్థులను సైతం ఫీజులు కట్టాలంటూ యాజమాన్యం తీవ్రంగా వేధిస్తోందని ఆరోపిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల కాకపోతే తమ తప్పేంటని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమయానికి ఫీజు కట్టలేదనే కారణంతో రూ.5 వేలకు పైగా జరిమానాలు విధిస్తూ పేద విద్యార్థుల నడ్డి విరుస్తున్నారని మండిపడుతున్నారు. గతంలో విద్యార్థులు వ్యక్తిగత కారణాలతో మృతి చెందినా, ఫీజుల ఒత్తిడి వల్లే చనిపోయారనే ప్రచారం జరగడానికి యాజమాన్య వైఖరే కారణమని వివరిస్తున్నారు.


