చంద్రగిరి: శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న పశువైద్య విజ్ఞాన కళాశాల, వెటర్నరీ ఫిజియాలజీ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం ప్రాంతీయ సదస్సుతో పాటు సౌత్ జోన్ వెటర్నరీ ఫిజియాలజీ క్విజ్ పోటీలు నిర్వహించారు. తిరుపతి పశువైద్య విజ్ఞాన కళాశాల ప్లాటినం జూబ్లీ వేడుకల్లో భాగంగా, సొసైటీ ఆఫ్ యానిమల్ ఫిజియాలజిస్టస్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్యఅతిథిగా వీసీ వైకుంఠరావు పాల్గొనగా, విశిష్ట అతిథులుగా పశువైద్య విజ్ఞాన విభాగం డీన్ డాక్టర్ సురేష్ కుమార్, రిజిస్ట్రార్ డాక్టర్ వినూ పాల్గొన్నారు. గౌరవ అతిథులుగా పుదుచ్చేరిలోని రాజీవ్‌గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెటర్నరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ మాజీ డీన్, బెంగళూరులోని ఐసీఏఆర్–నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యానిమల్ న్యూట్రిషన్ అండ్ ఫిజియాలజీ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ వీరాసామి సెజియన్, తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాల ప్రొఫెసర్ భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. క్విజ్ పోటీ ఒక ప్రధాన ఆకర్షణగా నిలిచింది. వివిధ ప్రాంతాల్లో జోనల్ స్థాయి క్విజ్ పోటీలను నిర్వహించారు. తిరుపతిలో నిర్వహించిన సౌత్ జోన్ వెటర్నరీ ఫిజియాలజీ క్విజ్ పోటీలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన వివిధ పశువైద్య కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. విజేత విద్యార్థులను నిర్వాహకులు అభినందించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి పశువైద్య విజ్ఞాన కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ మాలకొండయ్య అధ్యక్షునిగా, ఫిజియాలజీ విభాగాధిపతి డాక్టర్ రాంబాబు నాయక్ సమన్వయకర్తగా వ్యవహరించారు.
16న తిరుపతిలో జాబ్‌మేళా
తిరుపతి అర్బన్: తిరుపతి కరకంబాడీ రోడ్డులోని క్లాక్ ఓ అగ్రికల్చర్ సంస్థ కార్యాలయంలో ఈ నెల 16న జాబ్ మేళా నిర్వహించనున్నట్టు జిల్లా ఉపాధి, నైపుణ్యాభివృద్ధి అధికారి పద్మజ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. సూపర్ వైజర్ల పోస్టుకు బీటెక్, టెక్నీషియన్‌కు డిప్లోమా, మార్కెటింగ్‌కు ఎంబీఏ, ఎడిటింగ్ ఎడిటర్‌గా రెండేళ్ల అనుభవం ఉన్న పురుషులు అర్హులుగా పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ విద్యార్హత సర్టిఫికెట్స్‌తో సోమవారం క్లాక్ ఓ అగ్రికల్చర్ సంస్థ వద్దకు హాజరుకావాలని సూచించారు. అదనపు సమాచారం కోసం 6303573030, 9505601887 నంబర్లలో సంప్రదించాలని కోరారు.


