చిత్తూరు కార్పొరేషన్: పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఈమేరకు జిల్లాలోని 617 పంచాయతీల్లో మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించనున్నారు. మొదటి విడతలో పలమనేరు, కుప్పం నియోజకవర్గాలు, రెండో విడతలో పూతలపట్టు, నగరి నియోజకవర్గాలతో పాటు రొంపిచెర్ల, పులిచెర్ల మండలాలు, మూడోవిడతలో జీడీనెల్లూరు, చిత్తూరు నియోజకవర్గాల్లోని పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లాలోని మొత్తం 617 సర్పంచ్‌లు, 5,866 వార్డు స్థానాలకు ఎన్నికలు చేపట్టనున్నారు. జిల్లాలో మొత్తం గ్రామీణ ఎస్టీ ఓటర్లు 28,973, ఎస్సీ ఓటర్లు 2,47,416, బీసీ ఓటర్లు 4,70,795, ఓసీ ఓటర్లు 2,75,558 కాగా మొత్తం ఓటర్లు 10,22,742 మంది ఉన్నారు. ఈ క్రమంలో ఎన్నికల సిబ్బందిని 8,608 మందిని నియమించారు. మొత్తం 1075 ప్రాంతాల్లో 5886 పోలింగ్ కేంద్రాల నందు ఎన్నికలు జరగనున్నాయి. అందులో భాగంగా 27 మండలాలకు గాను మొత్తం 135 నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 6,473 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు.
రిజర్వేషన్లు
జిల్లాలో సర్పంచ్ స్థానాలకు రిజర్వేషన్ ప్రకటించారు. ఎస్టీ జనరల్–16, మహిళ–3, ఎస్సీ జనరల్– 83, మహిళ– 72, బీసీ జనరల్– 64, మహిళ–62, అన్ రిజర్‌డ్వ్ జనరల్–153, మహిళ–163గా నిర్ణయించారు. అలాగే వందశాతం ఎస్టీ జనాభా గల పంచాయతీల ఆరు ఉండగా, అందులో జనరల్ 4, మహిళలకు 2 స్థానాలు కేటాయించారు.
27 మంది నోడల్ అధికారులు
జిల్లాలోని 27 మండలాలకు నోడల్ అధికారులను నియమించారు. చిత్తూరు మండలానికికు జేడీ సెరి కల్చర్ వాణి, గుడిపాలకు చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, జీడీనెల్లూరుకు పీడీ డీఆర్‌డీఎ శ్రీదేవి, కార్వేటినగరానికి జిల్లా గిరిజన సంక్షేమాధికారి శివప్రసాద్, పాలసముద్రానికి జిల్లా మహిళా శిశు సంక్షేమాధికారి శ్యామ్‌సుగుణకుమారి, పెనుమూరుకు ఎస్‌డీసీ, కేఆర్‌ఆర్‌సీ వెంకటసునీల్, ఎస్‌ఆర్‌పురానికి జేడీ పశుసంవర్థకశాఖ ఉమామహేశ్వరి, వెదురుకుప్పానికి ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ పుల్లయ్య, గుడుపల్లెకు ఏపీడీ, కేడీఎ శ్రీనివాస్‌రాజ్, కుప్పం మండలానికి డీఎల్‌డీఓ నరసింహనా యుడు, రామకుప్పం మండలానికి పీడీ డీడబ్ల్యూఎంఏ రవికుమార్, శాంతిపురానికి హుస్సేన్ కుప్పం ఆర్డీఓ, నగరికి జిల్లా గనులు, భూగర్భశాఖాధికారి సత్యనారాయణ, నిండ్రకు డీఎల్‌డీఓ విజయరావు, విజయపురానికి నగరి ఆర్డీఓ అనుపమ, బైరెడ్డిపల్లెకు సివిల్ స్లపయిస్ జిల్లా మేనేజర్ లక్ష్మి, గంగవరానికి ఏడీ పశుసంవర్థకశాఖ సుజాత, పలమనేరుకు ఆర్డీఓ భవానీ, పెద్దపంజాణికి డీఎల్‌ఎడీఓ లక్ష్మిపతి, వి.కోటకు ఏడీ మార్కెటింగ్ పరమేశ్వరన్, పులిచెర్లరే డీఐసీ జీఎం సూరిబాబు, రొంపిచెర్లకు జిల్లా వ్యవసాయశాఖాధికారి మురళి, బంగారుపాళ్యం మండలానికి జిల్లా సహకారశాఖాధికారి లక్ష్మి, ఐరాలకు పీడీ ఏపీఎంఐపీ రమణ, పూతలపట్టుకు డీడీ మత్స్యశాఖ ప్రమోదమల్లి, తవణంపల్లెకు పీఓ సమగ్రశిక్ష వెంకటరమణ, యాదమరికి డీఈఓ లక్ష్మీనారాయణ నోడల్ అధికారులుగా వ్యవహరించనున్నారు.
ఏకగ్రీవాలకు నజరానా
ఎన్నికలకు వెళ్లకుండా ఏకగ్రీవం చేసుకునే పంచాయతీలకు ప్రభుత్వం నజరానా ప్రకటించింది. 5వేల లోపు జనాభాకు రూ.15 లక్షలు, 5–10 వేల మధ్య జనాభా ఉంటే రూ.25 లక్షలు, 10వేల కంటే ఎక్కువ ఉంటే రూ.50 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.


