చిత్తూరు కలెక్టరేట్ : సర్పంచ్ నామినేషన్ కేంద్రాల ఏర్పాటుపై టీడీపీ నేతలు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ ఉద్యోగ, పెన్షనర్ల విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయసింహారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఈ మేరకు డీఆర్ఓ మోహన్ కుమార్‌కు పార్టీ నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికార పార్టీ కుట్రలకు పాల్పడుతోందన్నారు. గతంలో ఉన్న పద్ధతికి భిన్నంగా ప్రస్తుతం టీడీపీకి అనుకూలంగా ఉండే మండల కార్యాలయాలు, వారికి పట్టున్న గ్రామాల్లో క్లస్టర్ హెడ్లను ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. అక్కడ నామినేషన్లు స్వీకరించేలా పన్నాగాలు పన్నుతున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ మద్దతుదారులు నామినేషన్లు వేయకుండా అడ్డుకోవాలనే దురాలోచనకు తెగబడుతున్నారని విమర్శించారు. ఈ వ్యవహారంపై తక్షణమే స్పందించి, గతంలో ఎక్కడైతే క్లస్టర్ హెడ్లలో నామినేషన్లు తీసుకున్నారో అవే కేంద్రాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కుట్రలపై జిల్లా ఎన్నికల అధికారి ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా, ప్రశాంతంగా జరిగేందుకు తగిన పోలీస్ రక్షణ ఏర్పాటు చేయాలని సూచించారు. వైఎస్సార్సీపీ నేత ఉదయ్‌రెడ్డి పాల్గొన్నారు.


