ఇక బస్సులే గతి! | - | Sakshi
Sakshi News home page

ఇక బస్సులే గతి!

Nov 12 2026 3:24 AM | Updated on Nov 12 2026 3:24 AM

గరుడాద్రి, సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ల రద్దు విద్యార్థులు, ఉద్యోగులు, చిరు వ్యాపారులకు ఇబ్బందులు చైన్నె ప్రయాణాలకు ఇక బస్సులే ప్రత్యామ్నాయం

నగరి: రేణిగుంట రైల్వే స్టేషన్‌లో చేపడుతున్న యార్డు పునర్వ్యవస్థీకరణ పనులు నగరి ప్రాంత రైలు ప్రయాణికులకు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. దక్షిణ రైల్వే ప్రకటించిన రైళ్ల రద్దు, వేళల మార్పులతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా తిరుపతి–చైన్నె మార్గంలో నిత్యం రాకపోకలు సాగించే నగరి, ఏకాంబరకుప్పం ప్రాంత ప్రజలకు ఈ నిర్ణయం భారంగా మారనుంది. ఇకపై చైన్నె వెళ్లాలంటే బస్సులే గతి అయింది.

రెండు నెలలపాటు తప్పని అవస్థలు

నగరి, ఏకాంబరకుప్పం రైల్వే స్టేషన్ల నుంచి ప్రతిరోజూ వందలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు చైన్నెకి రాకపోకలు సాగిస్తుంటారు. తక్కువ ఖర్చుతో, నిర్ణీత సమయానికి గమ్యస్థానాలకు చేరుకునేందుకు రైళ్లపైనే ఆధారపడుతున్నారు. ఈ నెల 10 నుంచి డిసెంబరు 27 వరకు ఆరు మెయిన్‌ లైన్‌ ఎలక్ట్రికల్‌ మల్టిపుల్‌ యూనిట్‌ టైన్లు (66001, 66006, 66043, 66044, 66069, 66070), డిసెంబర్‌ 1 నుంచి 27 వరకు గరుడాద్రి ఎక్స్‌ప్రెస్‌, డిసెంబర్‌ 9 నుంచి 27 వరకు సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేయడంతో పలువురి ప్రయాణాలకు ఆటంకం కలగనుంది. ముఖ్యంగా ఉదయం చైన్నెకి వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చే ప్రయాణికులకు ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యం భారంగా మారనుంది.

విద్యార్థులు, ఉద్యోగులకు సమయాభావం

రైళ్లలో ప్రయాణిస్తూ నిత్యం చైన్నెలోని కళాశాలలు, కార్యాలయాలకు వెళ్లే వారు సమయానికి చేరుకోవడం కష్టసాధ్యంగా మారనుంది. బస్సుల్లో ప్రయాణిస్తే ట్రాఫిక్‌ రద్దీ, ప్రయాణ సమయం, అదనపు ఛార్జీల భారం తప్పదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రోజువారి ప్రయాణాలపై ఆధారపడే విద్యార్థులు, ఉద్యోగులు ఈ రైళ్ల రద్దుతో ఇబ్బందులు ఎదుర్కోక తప్పని పరిస్థితి.

చిరు వ్యాపారుల ఉపాధిపైనా ప్రభావం

మరోవైపు నగరి ప్రాంతానికి చెందిన పలువురు యువకులు చైన్నెలోని వ్యాపార సంస్థలకు అవసరమైన వస్తువులను ప్రతిరోజూ తీసుకొచ్చి అందజేస్తూ వచ్చే కమీషన్‌తో జీవనం సాగిస్తున్నారు. వారు ఉదయాన్నే రైలులో చైన్నెకి వెళ్లి వస్తువులు సేకరించి తిరిగి నగరి ప్రాంతానికి చేరుకుంటారు. ఇప్పుడు రైళ్ల రద్దుతో వారి రాకపోకలకు ఆటంకం ఏర్పడడమే కాకుండా, అదనపు బస్సు ఛార్జీలు పడనున్నాయి. అలాగే సమయాభావం కారణంగా ఉపాధిపై ప్రభావం పడే అవకాశం ఉంది.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి

రేణిగుంటలో పనులు చేపట్టడం రైల్వే పరంగా అవసరమైనప్పటికీ, నిత్యం రైళ్లపై ఆధారపడే నగరి, ఏకాంబరకుప్పం ప్రాంత ప్రయాణికుల ఇబ్బందులను కూడా అధికారులు పరిగణనలోకి తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. సాధ్యమైన మేరకు ప్రత్యామ్నాయ రైళ్లను నడపడం లేదా ప్రత్యేక రవాణా సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రైళ్ల రద్దు నిర్ణయంతో విద్యార్థులు, ఉద్యోగులు, చిరు వ్యాపారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు రైల్వే అధికారులు ఎలాంటి పరిష్కారం చూపుతారో వేచి చూడాల్సి ఉంది.

డిసెంబర్‌ 27 వరకు పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement