చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరంలోని కట్టమంచిలో ఓ రిటైర్డు పోలీసు అధికారి ఇంట్లో దొంగలు పడ్డారు. బంగారు, వెండి ఆభరణాలు, నగదు చోరీ చేశారు. బాధితుడి కథనం మేరకు.. కట్టమంచికి చెందిన సుధాకర్ పోలీసుశాఖలో ఏఎస్‌ఐగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. ఆయన ఈ నెల 7వ తేదీన బెంగళూరులో ఉన్న తన కుమారుడి ఇంటికి వెళ్లారు. 10వ తేదీన చిత్తూరులోని తన పక్కింటి వాళ్లు సుధాకర్‌కు ఫోన్‌చేసి ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయంటూ తెలిపారు. ఆయన హుటాహుటిని ఇంటికి వచ్చి చూడగా బీరువాకు తాళం వేయకుండా ఊరికి వెళ్లినట్లు గుర్తించారు. ఇంటి తాళాలు పగులగొట్టిన గుర్తుతెలియని వ్యక్తులు బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, రూ.లక్ష వరకు నగదు చోరీ చేసినట్టు తేల్చారు. దీనిపై వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
బావిలో పడి వ్యక్తి మృతి
గుడిపాల: మండలంలోని చీలాపల్లె సమీపంలో బుధవారం బావిలో పడి వ్యక్తి మృతిచెందాడు. గ్రామానికి చెందిన విజయకుమార్(37) కూలి పనులతోపాటు పాడి ఆవును మేపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం ఉదయం పొలం వద్దకు వెళ్లాడు. బావిలో కొబ్బరి బోండా ఉండడాన్ని గమనించాడు. దాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తూ కాలుజారి నీటిలో పడిపోయాడు. అతనికి ఈత రాకపోవడంతో నీటిలో మునిగి మృతిచెందాడు. దీనిపై తమకు ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం
చిత్తూరు కార్పొరేషన్ : దౌర్జన్యాలు, దాడులతో స్థానిక ఎన్నికల ప్రక్రియను అధికార పార్టీ ఖూనీ చేసిందని సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు నాగరాజు, గంగరాజు ఆరోపించారు. వారు బుధవారం స్థానిక గాంధీవిగ్రహం వద్ద నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు, లోకేష్ స్థానిక సంస్థల ఎన్నికల్లో దాడులు చేయించారని తెలిపారు. ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, కొట్టడం, కిడ్నాప్ చేయడం వంటి అరాచకాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. నామినేషన్లు విత్‌డ్రా చేయకుండానే చేసినట్లు దొంగ సంతకాలు పెట్టడం దుర్మార్గమన్నారు. అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాల కాలంలో ప్రజలకు మంచి చేసి ఉంటే ఇంతగా భయపడాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించామని గొప్పలు చెప్పుకుంటున్న కూటమి నేతలకు కోర్టు అక్షింతలు వేసినా బుద్ధి రాలేదని విమర్శించారు. అక్రమాలు, అరాచకాలు సోషల్ మీడియా, పత్రికల్లోనూ ఆధారాలతో బయటకు వచ్చినా ఇంక అధికార పార్టీ నాయకులు సర్దిచెప్పుకోవడం సరికాదన్నారు. దౌర్జన్యాలకు ఎదురు నిలబడి ఎన్నికలకు వెళితే ప్రతిపక్ష ఏజెంట్లను బెదిరించి బయటకు పంపడమేమిటన్నారు. రిగ్గింగ్, దొంగ ఓట్లుతో గెలిచిన దానిని విజయమని చెప్పరని తెలిపారు. సిగ్గు లేకుండా సంబరాలు, విజయోత్సవ యాత్రలు చేయడం జుగుప్సాకరంగా ఉందన్నారు. కమ్యూనిస్టులకు శక్తిలేదని ఊదరగొట్టే పాలకులు కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేస్తే ఎందుకంత భయపడుతున్నారని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి దౌర్జన్యాలు జరగకుండా ప్రజలు పోరాడాలన్నారు. వామపక్షాలు చేసే పోరాటంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు గోపీనాథ్, మణి, విజయగౌరీ, రమాదేవి, సురేంద్ర, జ్యోతిరావు, రాజశేఖర్, లక్ష్మణ్ పాల్గొన్నారు.
మానవ అక్రమ రవాణా
నిర్మూలనపై శిక్షణ
చిత్తూరు రూరల్ (కాణిపాకం): మానవ అక్రమ రవాణా, వెట్టి చాకిరీ వంటి సామాజిక నేరాల నిర్మూలనపై పోలీస్ అధికారులు, సిబ్బందికి మరింత అవగాహన ఉండాలని అడిషనల్ ఎస్పీ మహబూబ్ బాషా పేర్కొన్నారు. చిత్తూరు నగరంలోని జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో బుధవారం రోప్స్, ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ సంస్థల సౌజన్యంతో దర్యాప్తు అధికారులకు ఒకరోజు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా, వెట్టి చాకిరీ బాధితులను గుర్తించడం, రక్షించడం, వారికి పునరావాసం కల్పించడంలో దర్యాప్తు అధికారులు కీలక పాత్ర పోషించాలన్నారు. చట్టపరమైన అంశాలు, సమర్థవంతమైన దర్యాప్తు విధానాలపై ఆచరణాత్మక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. నేరాలను అరికట్టడమే కాకుండా బాధితులకు గౌరవప్రదమైన జీవితాన్ని అందించడమే లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తోందన్నారు. ఐజేఎం ప్రతినిధులు తిరుపతిరావు, ప్రసన్న మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా నిరోధక చట్టాలు, క్షేత్రస్థాయి దర్యాప్తులో ఎదురయ్యే సవాళ్లు, సాంకేతిక అంశాలను వివరించారు. ఈ శిక్షణలో పీటీసీ డీఎస్పీ రాంబాబు, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ వెంకటప్ప, 100 మందికి పైగా సీఐలు, ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది, రోప్స్, ఐజేఎం ప్రతినిధులు పాల్గొన్నారు.


