ఎన్నికల్లో అక్రమాలపై నిరసన నేడు | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల్లో అక్రమాలపై నిరసన నేడు

Nov 11 2026 12:13 AM | Updated on Nov 11 2026 12:13 AM

చిత్తూరు కార్పొరేషన్‌: స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం పాల్పడిన అక్రమాలపై బుధవారం నిరసన చేపట్టనున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి నాగరాజు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో చిత్తూరులోని గాంధీవిగ్రహం, నగరిలోని టవర్‌క్లాక్‌, పలమనేరులోని బస్టాండ్‌ వద్ద నిరసన వ్యక్తం చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే బంగారుపాళ్యంలో తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేయనున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని అధికార పార్టీ నేతలు ఖూనీ చేశారన్నారు. అభివృద్ధి చేశామని చెప్పుకునే నాయకులకు ఎన్నికలంటే భయమెందుకని ప్రశ్నించారు. అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలను చించివేయడం, దాడి చేయడమేంటని మండిపడ్డారు. పలు ప్రాంతాల్లో పోటీ నుంచి అభ్యర్థులు తప్పుకోకపోయినా దొంగ సంతకాలతో ఏకగ్రీవం చేసుకున్నారని ఆరోపించారు. మణి, గోపీనాథ్‌, కుమారి, బాలాజీరావు పాల్గొన్నారు.

ఎంపీపీ, జెడ్పీ చైర్మన్‌

ఎన్నికలకు కసరత్తు

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా వ్యాప్తంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌, కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తి అయిన విషయం విధితమే. అనంతరం ఎంపీపీ, జెడ్పీ చైర్మన్‌ల (పరోక్ష) ఎన్నికకు మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీచేసింది.షెడ్యూల్‌ ప్రకారం జిల్లాలో ఎన్నిక నిర్వహించేందుకు అధికారులు కసరత్తు నిర్వహిస్తున్నారు. ఈ నెల 19న జిల్లాలోని 27 మండల పరిషత్‌లలో ఎంపీపీ, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు చేపట్టనున్నారు. 20న జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ పదవులకు పరోక్ష ఎన్నికలు జరిపించేందుకు సన్నాహలు చేస్తున్నారు. ఈ పరోక్ష ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు ఓటు హక్కు ఉండదని ఎస్‌ఈసీ స్పష్టం చేసింది. ఎన్నికై న ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులందరికీ ఈ నెల 14వ తేదీ లోపు ప్రత్యేక సమావేశాల నోటీసులను అధికారులు అందజేయనున్నారు. చేతులెత్తే పద్ధతిలో ఎన్నికలు నిర్వహించనున్నారు. కో–ఆప్షన్‌ సభ్యుల ఎన్నికలను మినహాయించి, మిగిలిన వాటికి పార్టీలు విప్‌ జారీ చేయవచ్చని అధికారులు వెల్లడించారు. నిబంధనల ప్రకారం స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా ప్రత్యేక సమావేశాలకు హాజరుకావచ్చని తెలిపారు.

వైభవం.. ఆకాశ దీపోత్సవం

కాణిపాకం: కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామివారి ఆలయ అనుబంధమైన శ్రీమణికంఠేశ్వరస్వామివారి దేవాలయంలో మంగళవారం వైభవంగా ఆకాశదీపోత్సవం నిర్వహించారు. కార్తీక మాసం మొదటి రోజు సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని రాతి స్తంభం వద్ద అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆకాశదీపం వెలిగించి పైకి ఎగురవేశారు. ఆలయ ఈఓ పెంచల కిషోర్‌ పాల్గొన్నారు.

శ్రీవారి దర్శనానికి

20 గంటలు

తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. సోమవారం క్యూలైన్‌ శిలాతోరణం వద్దకు చేరింది. సోమవారం అర్ధరాత్రి వరకు 83,609 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 24,816 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.95 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 20 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement