చిత్తూరు కలెక్టరేట్ : విద్యుత్ సబ్‌స్టేషన్లు, లైన్ల నిర్మాణంలో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు న్యాయమైన పరిహారం అందించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో కుప్పం పారిశ్రామిక అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గుడుపల్లెలో 200/132 కేవీ, రామకుప్పంలో 400/220 కేవీ సబ్‌స్టేషన్‌ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. వి.కోట ఫీడర్ నుంచి శాంతిపురం, గుడుపల్లె, రామకుప్పం మీదుగా విద్యుత్ లైన్లు వెళుతుండడం, టవర్ల నిర్మాణం, భూముల వినియోగం కారణంగా ప్రభావితమయ్యే రైతుల జాబితాను ఈనెల 30వ తేదీ లోపు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. తహసీల్దార్లు, వ్యవసాయ, ఉద్యానవన, అటవీ, ఇరిగేషన్, ఏపీ ట్రాన్స్‌కో తదితర శాఖల అధికారులు ఉమ్మడిగా క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. భూములు, పంటల నష్టాలను పారదర్శకంగా అంచనా వేయాలని సూచించారు. పరిశీలన పూర్తయిన నెలలోపు పరిహారం అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.కడా పీడీ, జేసీ ఆదర్శ రాజేంద్రన్, అసిస్టెంట్ కలెక్టర్ వెంకటేష్ పాల్గొన్నారు.
‘సహకార’ ఎన్నికలకు ఏర్పాట్లు
జిల్లాలోని 33 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) పాలకవర్గాల ఎన్నికలకు ఏర్పాట్లను వేగవంతం చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ స్పష్టం చేశారు. రాష్ట్ర సహకార శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలో ఎన్నికల ప్రక్రియ సన్నాహక చర్యలు ప్రారంభమైనట్లు వెల్లడించారు. మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. సంఘాల సభ్యుల వివరాల సేకరణ, ఈకేవైసీ ప్రక్రియ, పక్కాగా ఓటర్ల జాబితాల తయారీ, నియోజకవర్గాల వర్గీకరణ, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఎన్నికల సామగ్రి సేకరణ, సిబ్బందికి శిక్షణ తదితర కీలక అంశాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వివరించారు.ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు సహకార శాఖ పూర్తి సన్నద్ధంగా ఉందని తెలిపారు.
అర్హులైన ఓటర్లకు మరో అవకాశం
ఓటరు జాబితాలో పేరు లేని అర్హులకు మరొక అవకాశం కల్పించారని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. ప్రత్యేక గైర్హాజరు, నివాసం మారడం, మరణం వంటి కారణాలతో పేర్లు చేరని వారి వివరాలను సంబంధిత పోలింగ్ కేంద్రాలు, పంచాయతీ, పురపాలక కార్యాలయాల్లో ప్రదర్శించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. బీఎల్‌ఓలతో నమోదు పత్రాలు అందజేయడంతో పాటు వాట్సాప్, సాధారణ మెసేజ్‌లతో వివరాలను పంపిస్తారని వివరించారు. ఓటర్లు వెబ్‌సైట్, యాప్‌లో సైతం పత్రాలు పొందవచ్చన్నారు. నివాసం మారని వారు ‘అనుబంధం–బి’, వేరే ప్రాంతానికి మారిన వారు ‘అనుబంధం–సి’ ప్రకటన సమర్పించాలన్నారు. వీరు ప్రత్యేకంగా ఫారమ్8 ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. చిరునామా లేని నిరాశ్రయులకు బీఎల్‌ఓ పరిశీలన ఆధారంగా నివాస ధ్రువీకరణ కల్పిస్తారని తెలిపారు. ఇప్పటికే ఫారమ్ 6 లో కొత్తగా నమోదు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరంలేదన్నారు. అర్హులైన వారి పేర్లను పరిశీలించి తుది జాబితాలో చేర్చి, పాత గుర్తింపు సంఖ్యనే కేటాయిస్తామని వివరించారు. ఈ నెల 20వ తేదీలోపు మొత్తం ప్రక్రియ పూర్తి చేస్తారని తెలిపారు.


