చిత్తూరు కలెక్టరేట్ : న్యూఢిల్లీ వేదికగా నిర్వహించిన 70వ జాతీయ పాఠశాల క్రీడా పోటీల్లో చిత్తూరులోని ఆర్కే విద్యాలయ విద్యార్థిని సుమైరా అన్సారీ సయ్యద్ ప్రతిభ కనబరిచింది. అండర్–17 టెన్నిస్ బాలికల విభాగంలో రాష్ట్ర జట్టు తరఫున కాంస్య పతకం సాధించింది. మంగళవారం ఈ మేరకు ప్రిన్సిపల్ ఎం.రమేష్ బాబు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థినికి పాఠశాల యాజమాన్యం తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.పతకం సాధించిన విద్యార్థిని సుమైరాను కళాశాల మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ కల్పజ అభినందించారు.


