ఎంపీటీసీ ఎన్నికల పోరులో.. | - | Sakshi
Sakshi News home page

ఎంపీటీసీ ఎన్నికల పోరులో..

Nov 11 2026 12:13 AM | Updated on Nov 11 2026 12:13 AM

స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీగా చెల్లని ఓట్లు ఓటర్లకు అవగాహన కల్పించడంతో విఫలమైన అధికారులు నోటాకు సైతం పెద్దసంఖ్యలో మొగ్గుచూపిన ప్రజలు

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ఇటీవల నిర్వహించిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో నమోదైన అధికారిక గణాంకాలను పరిశీలిస్తే చెల్లని ఓట్లు, నోటా గణాంకాలు విశ్లేషకులను విస్మయానికి గురిచేస్తున్నాయి.

జెడ్పీటీసీ ఎన్నికల పోరులో..

జెడ్పీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపులో జిల్లా వ్యాప్తంగా పోలైన మొత్తం ఓట్లు 6,84,681 (పోలింగ్‌ శాతం 76.7), చెల్లుబాటు అయిన ఓట్లు 6,65,848, చెల్లని ఓట్లు 14,845 (మొత్తం పోలైన ఓట్లల్లో ఇది 2.17 శాతం), నోటా ఓట్లు 3988 (ఇది 0.58 శాతం)గా నమోదైంది. కొన్ని మండలాల్లో గెలుపు మెజారిటీ కంటే చెల్లని ఓట్ల సంఖ్యే ఎక్కువగా ఉండటం గమనార్హం. వి.కోట, గంగవరం, పెనుమూరు, గంగాధరనెల్లూరు జెడ్పీటీసీ అభ్యర్థులకు మెజారిటీ కంటే చెల్లని ఓట్లు ఎక్కువగా నమోదయ్యాయి. వి.కోటలో మెజారిటీ 618 అయితే, చెల్లని ఓట్లు 1,161 ఉన్నాయి. గంగవరంలో మెజారిటీ 510 అయితే చెల్లని ఓట్లు 707, పెనుమూరు లో 184 మెజారిటీ రాగా, 405 చెల్లని ఓట్లు, గంగాధరనెల్లూరులో మెజారిటీ 304 అయితే చెల్లని ఓట్లు 749 నమోదు కావడం విశేషం. ఇదే జెడ్పీటీసీ ఎన్నికల్లో నోటా ఓట్లు ఎక్కువగా సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో రావడం విశేషం. కుప్పంలో 281, రామకుప్పం లో 247, శాంతిపురంలో 284, పలమనేరు నియోజకవర్గంలోని వి.కోట లో 295, నగరి లో 249 ఓట్లు నోటాకు నమోదు అయ్యాయి.

ఎంపీటీసీ ఎన్నికల్లో చెల్లని ఓట్ల సంఖ్య మరింత ఆందోళనకరంగా ఉంది. మొత్తం 300 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 6,20,119 ఓట్లు (77.6 శాతం) పోల్‌ అయ్యాయి. 14,322 ఓట్లు (పోలైన ఓట్లలో 2.24 శాతం) చెల్లనివి కాగా, 4,351 (0.68 శాతం) ఓట్లు నోటా ఖాతాలో పడ్డాయి. జిల్లా వ్యాప్తంగా 26 ఎంపీటీసీ సెగ్మెంట్‌లలో గెలుపు అభ్యర్థుల కంటే చెల్లని ఓట్ల సంఖ్యే ఎక్కువగా నమోదైంది. వి.కోట మండలం ముదరందొడ్డి–2 ఎంపీటీసీ సెగ్మెంట్‌లో కేవలం 1 ఓటు మెజారిటీ విజయం సాధించగా, అక్కడ 60 ఓట్లు చెల్లకుండా పోయాయి. విజయపురం మండలం ఇళ్లూరులో కేవలం 3 ఓట్ల మెజారిటీ రాగా అక్కడ 28 ఓట్లు చెల్లనివిగా తేలాయి. కార్వేటినగరం–2 లో 5 ఓట్ల మెజారిటీ నమోదైతే 76 ఓట్లు చెల్లలేదు. శాంతిపురం మండలం రాళ్లబూదుగూరులో కేవలం 6 ఓట్ల మెజారిటీ రాగా 69 ఓట్లు చెల్లకుండా పోయాయి.

అధికారుల వైఫల్యం!

వేల సంఖ్యలో ఓట్లు చెల్లనివిగా మారుతుండటంపై ఎన్నికల నిర్వహణ సరళిపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బ్యాలెట్‌ పేపర్లతో జరిగే ఈ ఎన్నికల్లో పోలింగ్‌ సిబ్బంది ఓటర్లకు సరైన అవగాహన కల్పించకపోవడం వల్లే ఇన్ని వేల సంఖ్యలో ఓట్లు చెల్లకుండా పోయాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్టాంపింగ్‌ విధానంలో తప్పులు చేయడం, ఒకటికి మించి గుర్తులపై ముద్ర వేయడం వంటి కారణాలతో చాలా ఓట్లు గల్లంతవుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి, గెలుపు ఓటముల సమీకరణాల హోరులో అణగారిపోయిన చెల్లని ఓట్ల గళం.. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాబోయే పంచాయతీ ఎన్నికలకు వెళుతున్న నాయకులకు ఓ హెచ్చరిక లాంటిదేనని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement