ఓడిన దౌర్జన్యం.. గెలిచిన ప్రజాస్వామ్యం | - | Sakshi
Sakshi News home page

ఓడిన దౌర్జన్యం.. గెలిచిన ప్రజాస్వామ్యం

Nov 10 2026 1:49 AM | Updated on Nov 10 2026 1:49 AM

ఆదివారం వేకువజాము వరకు ఉత్కంఠగా సాగిన పెనుమూరు జెడ్పీటీసీ కౌంటింగ్‌ అడ్డదారులు తొక్కినా కూటమికి తప్పని ఓటమి 184 ఓట్ల మెజారిటీతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నిరీషారెడ్డి విజయం కుట్రలను తిప్పికొట్టిన ప్రజాతీర్పు

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా కేంద్రంలోని సీతమ్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో శనివారం నిర్వహించిన కౌంటింగ్‌లో పెనుమూరు జెడ్పీటీసీ స్థానం లెక్కింపు ఆదివారం వేకువజాము వరకు సాగింది. జిల్లాలో అన్ని జెడ్పీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు ముగిసినప్పటికీ పెనుమూరు జెడ్పీటీసీ కౌంటింగ్‌ ప్రక్రియ అత్యంత నాటకీయ పరిణామాల మధ్య ఆదివారం వేకువజాము వరకు కొనసాగింది. కూటమి నేతలు ఎన్ని కుట్రలు చేసినా, అడ్డదారులు తొక్కి గెలుపొందాలని ప్రయత్నించినా.. అంతిమంగా ప్రజలు ఇచ్చిన తీర్పు ముందు పచ్చమూక ఆటలు సాగలేదు. వైఎస్సార్‌సీపీ పెనుమూరు జెడ్పీటీసీ అభ్యర్థిగా బరిలో నిలిచిన నిరీషా రెడ్డి తన ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి అరుణపై 184 ఓట్ల మెజారిటీతో అఖండ విజయం సాధించారు. నిరీషారెడ్డికి 12,921 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి అరుణకు 12,737 ఓట్లు వచ్చాయని అధికారులు వెల్లడించారు.

తొలుత మెజారిటీ.. ఆపై టీడీపీ కుట్రలు!

కౌంటింగ్‌ ప్రారంభమైనప్పటి నుంచే పెనుమూరు స్థానంపై తీవ్రమైన ఉత్కంఠ ఏర్పడింది. తొలి లెక్కింపులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నిరీషా రెడ్డికి స్పష్టంగా 222 ఓట్ల మెజారిటీ లభించింది. ఈ ఆధిక్యాన్ని చూసి టీడీపీ నేతలు కుట్రలకు తెరతీశారు. లెక్కల్లో తప్పులున్నాయంటూ ఒత్తిడి తెచ్చి, అధికారులతో బలవంతంగా రీ కౌంటింగ్‌ చేయించారు. అయినప్పటికీ ప్రజా తీర్పును తలకిందులు చేయలేకపోయారు.

ఆదివారం అధికారిక ప్రకటన

టీడీపీ వర్గాల ఒత్తిడి, విరామమెరుగని డ్రామాల నడుమ సుదీర్ఘంగా సాగిన లెక్కింపు ప్రక్రియ ఆదివారం వేకువజాము వరకు కొనసాగింది. అన్ని రౌండ్ల లెక్కింపు పూర్తికాగా, రీ కౌంటింగ్‌ నాటకాలు ఆడినప్పటికీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నిరీషా రెడ్డి 184 ఓట్ల స్పష్టమైన మెజారిటీతో గెలుపొందినట్లు రిటర్నింగ్‌ అధికారి ఆదివారం ఉదయం అధికారికంగా ప్రకటించారు. ఎన్నికల్లో గెలుపు కోసం నానా తంటాలు పడి, చివరికి అడ్డదారులన్నీ తొక్కిన పెనుమూరు మండల టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి అరుణకు ఓటమి తప్పలేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటర్లు ఇచ్చిన తీర్పు ముందు కుట్రలు ఎగిరిపోయాయని, అంతులేని ఆటంకాల నడము సాధించిన ఈ విజయం వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిందని పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం వైఎస్సార్‌సీపీ పెనుమూరు జెడ్పీటీసీగా నిరీషారెడ్డికి జెడ్పీ సీఈవో రవికుమార్‌ నాయుడు నియామకపత్రం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement