పలమనేరు : ప్రాదేశిక ఎన్నికల్లో విజయం సాధించిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటేగౌడ తెలిపారు. పరిషత్ ఎన్నికల్లో పలమనేరు నియోజకవర్గం నుంచి నిలబడిన అభ్యర్థులు, గెలిచినవారు ఆదివారం పలమనేరులోని నివాసంలో వెంకటేగౌడను మర్యాదపూర్వంగా కలిశారు. ఈ సందర్భంగా విజేతలను ఆయన అభినందించారు. ఓడిన వారు అధైర్యపడవద్దని పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుందని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అరాచకాలకు ధైర్యంగా ఎదురొడ్డి నిలబడిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ప్రజలే ప్రశంసింస్తున్నారని చెప్పారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు తప్పకుండా ఉంటుందని స్పష్టం చేశారు.
ద్రోహం చేస్తే చర్యలు తప్పవు
పార్టీలోనే ఉంటూ ద్రోహం చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని వెంకటేగౌడ హెచ్చరించారు. ఆ మేరకు గంగవరం మండలానికి చెందిన సీవీకుమార్, బాలేపల్లెకు చెందిన రెడ్డెప్పరెడ్డి, పెద్దపంజాణి మండలం రాయలపేటకు చెందిన చంద్రశేఖర్ రెడ్డి, అప్పినపల్లె రాజారెడ్డి, పలమనేరు మాజీ కౌన్సిలర్ శ్యామ్‌సుందర్‌రాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు నిరూపణ కావడంతో వారిపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్టు వెల్లడించారు.


