పల్లె బరి.. పక్కా పత్రాలు తప్పనిసరి! | - | Sakshi
Sakshi News home page

పల్లె బరి.. పక్కా పత్రాలు తప్పనిసరి!

Nov 10 2026 1:49 AM | Updated on Nov 10 2026 1:49 AM

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలో పంచాయతీ ఎన్నికల నగారా మోగడంతో గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్‌ పీఠంపై పోటీకి అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. అయితే నామినేషన్ల దాఖలు సమయంలో చిన్నపాటి సాంకేతిక పొరపాటు దొర్లినా నామినేషన్‌ పత్రం తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అభ్యర్థుల అర్హతలు, పాటించాల్సిన నిబంధనలు, ముందుగానే సిద్ధం చేసుకోవాల్సిన పత్రాల వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రపోజర్‌ నిబంధనలు

ప్రపోజర్‌ కచ్చితంగా సంబంధిత గ్రామ పంచాయతీ పరిధిలోని ఓటరై ఉండాలి. నామినేషన్‌న్‌ను అభ్యర్థి స్వయంగా, ప్రపోజర్‌తో మాత్రమే దాఖలు చేయాలి. పరిశీలన సమయంలో ఒక సెట్‌లో తప్పులు ఉన్నా నామినేషన్‌ చెల్లుబాటయ్యేందుకు వీలుగా అభ్యర్థులు 1 నుంచి 4 సెట్ల వరకు నామినేషన్లను దాఖలు చేయవచ్చని అధికారులు సూచిస్తున్నారు.

ప్రాథమిక అర్హతలు ఇవీ..

నామినేషన్‌ పరిశీలన నాటికి అభ్యర్థికి కనీసం 21 ఏళ్లు నిండి ఉండాలి.

పోటీ చేసే పంచాయతీ పరిధిలోని ఓటర్ల జాబితాలో పేరు నమోదై ఉండాలి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థల లాభదాయక పదవుల్లో ఉన్నవారు పోటీకి అనర్హులు.

సమర్పించాల్సిన ముఖ్యమైన పత్రాలు..

రిటర్నింగ్‌ అధికారి వద్ద తీసుకుని అభ్యర్థితో పాటు ప్రపోజర్‌ (సూచించే వ్యక్తి) సంతకాలతో తిరిగి సమర్పించాలి.

అభ్యర్థి, ప్రపోజర్‌ ఓటర్‌ కార్డ్‌ జిరాక్స్‌ కాపీలు, అభ్యర్థి ఆధార్‌ కార్డ్‌ జిరాక్స్‌

ఓటర్‌ లిస్ట్‌లోని అభ్యర్థి, ప్రపోజర్ల పార్ట్‌ నంబర్‌, సీరియల్‌ నంబర్లు స్పష్టంగా నమోదు చేయాలి.

వయసు ధ్రువీకరణకు 10వ తరగతి మార్కుల జాబితా, పుట్టిన తేదీ ప్రమాణ పత్రం

రిజర్వ్‌డ్‌ స్థానాల్లో పోటీ చేసేవారికి కుల ధ్రువీకరణ సర్టిఫికెట్‌ తప్పనిసరి. జనరల్‌ సీటులో పోటీ చేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు డిపాజిట్‌ తగ్గింపు కోసం సమర్పించవచ్చు.

పంచాయతీ బకాయిలు లేవని పంచాయతీ కార్యదర్శి జారీ చేసిన పత్రం, నేర చరిత్ర, ఆస్తులు, అప్పులు, కుటుంబ వివరాలతో కూడిన ప్రమాణ పత్రం (అఫిడవిట్‌) అందజేయాల్సి ఉంటుంది.

సర్పంచ్‌ పదవికి జనరల్‌ అభ్యర్థులు రూ.3వేలు ఎస్సీ,ఎస్టీ,బీసీ అభ్యర్థులు రూ.1,500 డిపాజిట్‌ చెల్లించిన రసీదు జత చేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement