చిత్తూరు కార్పొరేషన్ : చంద్రబాబు ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో చేసిన అక్రమాలు, దౌర్జన్యాలపై వామపక్షాల ఆధ్వర్యంలో బుధవారం నిరసన చేపట్టనున్నట్లు సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు నాగరాజు, గంగరాజు తెలిపారు. సోమవారం చిత్తూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. వామపక్ష పార్టీల రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు నిరసన వ్యక్తం చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం అరాచకాలకు పాల్పడిందన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు నామినేషన్ వేయకుండా అడ్డుకుందని మండిపడ్డారు. అలాగే నామినేషన్ పత్రాలను చించివేయడం, దాడి చేయడం వంటి దౌర్జన్యాలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు ప్రాంతాల్లో పోటి నుంచి అభ్యర్థులు తప్పుకోకపోయిన దొంగ సంతకాలతో ఏకగ్రీవాలు చేసుకున్నారని ఆరోపించారు. రెండున్నరేళ్లలో ప్రజలకు మంచి చేసుంటే ఎన్నికలంటే భయం ఎందుకని ప్రశ్నించారు. పోలీసులు, అధికారులను కీలుబొమ్మలుగా చేసి ఎన్నికలను ఏకపక్షంగా నిర్వహించారని విమర్శించారు. వందల మంది రౌడీమూకలను ఉపయోగించి దాడులు చేశారని స్పష్టం చేశారు. పోలింగ్ రోజు ప్రతిపక్ష ఏజెంట్లను బెదిరించి బయటికి తరిమేశారని మండిపడ్డారు. ప్రజలను మెప్పించి ఎన్నికల్లో గెలుపొందాలని, అప్రజాస్వామ్య పద్దతిలో కాదన్నారు. ఎన్నికల్లో గెలిచే సత్తా వామపక్షాలకు లేదని అధికార పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తుంటారని, అలాంటప్పుడు కమ్యూనిస్ట్ అభ్యర్థులు నామినేషన్ వేస్తే భయపడడం ఎందుకని నిలదీశారు. సమావేశంలో నేతలు జ్యోతిరావు, గోపీనాథ్, మణి పాల్గొన్నారు.


