మాజీ మంత్రిపై పోలీసు జులుం!
నగరి : ప్రాదేశిక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా నగరిలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. విజయపురం మండలం ఇల్లత్తూరు ఎంపీటీసీ స్థానం ఓట్ల లెక్కింపు, రీకౌంటింగ్ వ్యవహారం వివాదానికి దారితీసింది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దేవి 15 ఓట్ల మెజారిటీతో గెలిచినప్పటికీ, రీకౌంటింగ్ అనంతరం మూడు ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి ప్రభావతి గెలిచినట్లు ప్రకటించారని మాజీ మంత్రి ఆర్‌కే రోజా ఆరోపించారు. అధికారుల తీరుకు నిరసనగా కౌంటింగ్ కేంద్రం ఎదుట బైఠాయించారు. దీంతో ఆమెను పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి లాక్కెళ్లడం కలకలం రేపింది.
రీకౌంటింగ్‌పై నిలదీత
ఎన్నికల నిర్వహణ తీరుపై మాజీమంత్రి ఆర్‌కే రోజా అధికారులను నిలదీశారు. ఆమె మాట్లాడుతూ రెండు గంటల ముందే విజేతలుగా తేలిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు డిక్లరేషనన్ ఇచ్చేందుకు అధికారులు మీనమేషాలు లెక్కించారని, మూడు ఓట్లతో గెలిచినట్లు ప్రకటించిన టీడీపీ అభ్యర్థికి మాత్రం హడావుడిగా డిక్లరేషన్‌న్ ఇచ్చేశారని మండిపడ్డారు. తమకు న్యాయం జరిగే వరకు కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లేది లేదంటూ ప్రధాన గేటు ఎదుట బైఠాయించారు. రీకౌంటింగ్‌లో ఫలితాలు తారుమారుచేసిన ఆర్‌ఓ టి.జయచంద్రారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రోజా మాట్లాడుతూ.. అధికారులు పచ్చచొక్కాలు వేసుకొని పనిచేస్తున్నారని, రిటర్నింగ్ అధికారులు ప్రజాస్వామ్యబద్ధంగా విధులు నిర్వహించడం లేదని ఆరోపించారు. తొలుత తమ అభ్యర్థి గెలిచారని, డిక్లరేషన్ ఇస్తామని జేసీ, ఆర్‌డీఓ చెప్పారని, అయితే ఫోన్ రావడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయిందన్నా రు. ఏజెంట్లకు పాసులు ఇవ్వడం నుంచి గెలిచిన అభ్యర్థులకు డిక్లరేషన్లు అందించే వరకు అధికారులు పక్షపాతంతో వ్యవహరించారని మండిపడ్డారు. పోలీసులను, ఆర్‌ఓల ను ఉపయోగించుకుని గెలవడం కూడా ఒక గెలుపేనా? ఎలక్షన్ నిర్వహించడం ఎందుకు.. సెలక్షన్ పెట్టుకుంటే సరిపోతుంది కదా? అని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి ఉంటే ఓట్లు మార్చుకోవాల్సిన కర్మ వచ్చేది కాదని విమర్శించారు. అధికారులు సైతం ప్రజలకు విశ్వాసంగా ఉండాలిగానీ పార్టీలకు కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బైండోవర్లు, నిబంధనల పేరుతో వైఎస్సార్‌సీపీ శ్రేణులను ఇబ్బందులకు గురిచేస్తూ, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మండిపడ్డా రు. ప్రధానంగా నగరి సీఐ టీడీపీ నేతలకు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. అధికార దుర్వినియోగానికి పాల్ప డినవారు తప్పక ఫలితం అనుభవిస్తారని హెచ్చరించారు. ఈ క్రమంలో పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లి కారులోకి ఎక్కించడంతో రోజా అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.మాజీ మంత్రితో పోలీ సులు ఇలా వ్యవహరిస్తారా? ఇదేనా ప్రజాస్వామ్యం అంటూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తలకు గాయమైన వైఎస్సార్‌సీపీ కార్యకర్త
నిరసన వ్యక్తం చేస్తున్న మాజీమంత్రి ఆర్‌కే రోజా
అస్వస్థతకు గురైన మాజీ మంత్రి ఆర్‌కే రోజా
అధికారుల ‘పచ్చ’పాతం
నగరి ప్రభుత్వ డిగ్రీకళాశాలలో శనివారం నగరి, విజయపురం, నిండ్ర మండలాలకు చెందిన ప్రాదేశిక ఎన్నికల కౌంటింగ్ నిర్వహించారు. ఇల్లత్తూరు ఎంపీటీసీ స్థానానికి జరిగిన ఓట్ల లెక్కింపులో తొలుత వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దేవికి 15 ఓట్ల ఆధిక్యం వచ్చింది. దీంతో టీడీపీ అభ్యర్థి రీకౌంటింగ్ కోరారు. ఆర్‌ఓ వో ఆమోదించడంతో మళ్లీ రీకౌంటింగ్ జరిగింది. తొలి లెక్కింపులో చెల్లని ఓట్లుగా ప్రకటించిన వాటిని, చెల్లినవిగా నిర్ధారించి 3 ఓట్లతో టీడీపీ అభ్యర్ధి ప్రభావతి గెలుపొందినట్లు ఆర్‌ఓ ప్రకటించారు. దీనిపై మళ్లీ రీకౌంటింగ్ చేయాలని వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి మొరపెట్టుకున్నా ఆర్‌ఓ చెవికెక్కించుకోలేదు. వెనువెంటనే డిక్లరేషన్ కూడా ఇచ్చేశారు. విషయం తెలుసుకుని మాజీ మంత్రి ఆర్కేరోజా కౌంటింగ్ కేంద్రం గేటుముందు బైటాయించి నిరసన వ్యక్తం చేశారు.


