చిత్తూరు కలెక్టరేట్: చిత్తూరు సమీపంలోని సీతమ్స్ కళాశాల కౌంటింగ్ కేంద్రం వద్ద శనివారం అర్ధరాత్రి తీవ్రమైన ఉద్రిక్తత ఏర్పడింది. పెనుమూరు జెడ్పీటీసీ స్థానానికి సంబంధించిన లెక్కింపు ప్రక్రియ వివాదాస్పదంగా మారింది. వైఎస్సార్‌సీపీ పెనుమూరు జెడ్పీటీసీ అభ్యర్థి నిరీషా రెడ్డి 222 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అయినప్పటికీ టీడీపీ అభ్యర్థి అరుణ కౌంటింగ్ నివేదికల్లో అవకతవకలకు పాల్పడేందుకు యత్నిస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపించారు. మరోసారి ఓట్లను లెక్కించాలంటూ టీడీపీ అభ్యర్థి ఒత్తిడి తెచ్చినట్లు తెలిపారు. టీడీపీ నేతల ఒత్తిడికి తలొగ్గిన అధికారులు.. పెనుమూరు జెడ్పీటీసీ స్థానానికి ఆదివారం ఉదయం మరోసారి ఓట్ల లెక్కింపు (రీకౌంటింగ్) చేపడతామని ప్రకటించారు. అధికారుల నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ నేతలు ధర్నా చేపట్టారు.
సీఎం డౌన్ డౌన్ నినాదాలు
అధికారుల ఏకపక్ష నిర్ణయంపై వైఎస్సార్‌సీపీ పెనుమూరు మండల నాయకులు, కార్యకర్తలు భగ్గుమన్నారు. ఆదివారం ఉదయం రీకౌంటింగ్‌కు తాము ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని స్పష్టం చేస్తూ కౌంటింగ్ కేంద్రం బయట ప్రధాన రహదారిపై బైఠాయించారు. అర్ధరాత్రి ఎంత సమయం అయినా ఫలితం ప్రకటించాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సమయంలో టీడీపీ గూండాలు రాళ్ల దాడికి పాల్పడడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. కౌంటింగ్ కేంద్రం పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను మొహరించారు. ఈ ఘటనల నడుమ అర్ధరాత్రి 12 గంటలకు రీకౌంటింగ్ ప్రారంభించారు.


