తిరుపతి అర్బన్: అధికారుల అనాలోచిత విధానాలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. శుక్ర, శనివారాలు (రెండు రోజులు) అధికారులు ఎన్నికల కౌంటింగ్‌పై చర్చోప చర్చలు జరిపారు. శనివారం జిల్లా వ్యాప్తంగా 302 ఎంపీటీసీలకు సంబంధించి ఎనిమిది సెంటర్లలో కౌంటింగ్ జరుగుతుందన్నారు. అలాగే 31 జెడ్పీటీసీలకు సంబంధించిన ఫలితాలు సాయంత్రం 7 గంటల్లోపు పూర్తిగా వెల్లడిస్తామని మీడియా ద్వారా ప్రకటించారు. ఆ మేరకు టేబుల్స్, సిబ్బందిని ఏర్పాటు చేశామని బిల్డప్ ఇచ్చారు. అయితే సమాచారశాఖ ద్వారా శనివారం రాత్రి 7.20 గంటలకు ఎంపీటీసీలకు సంబంధించి 78 సెగ్మెంట్ ఫలితాలు, అలాగే జెడ్పీటీసీలకు సంబంధించి 4 స్థానాల ఫలితాలు మాత్రమే వెల్లడించారు. వంద శాతం ఫలితాలు వెల్లడించడానికి రాత్రి 12 గంటలపైన పూర్తి చేస్తారా..? అంటూ పలువురు చర్చించుకోవడం జరిగింది.


