తిరుపతి అర్బన్: దేశవ్యాప్తంగా ఉన్న సైనిక్ పాఠశాలల్లో 6, 9 తరగతుల ప్రవేశాల కోసం నిర్వహించే ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2027–28కి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైందని కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, విశ్వం విద్యాసంస్థల అధినేత ఎన్.విశ్వనాథ్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రవేశ పరీక్ష జాతీయ స్థాయిలో జరుగుతుందని వెల్లడించారు. 6వ తరగతిలో ప్రవేశం పొందడానికి 01–04–2015 నుంచి 31–03–2017 మధ్య జన్మించిన విద్యార్థిని విద్యార్థులు, 9వ తరగతిలో ప్రవేశం పొందడానికి 01–04–2012 నుంచి 31–03–2014 మధ్య జన్మించిన వారు అర్హులని వివరించారు. విద్యార్థులు దరఖాస్తులను ఈ ఏడాది డిసెంబర్ 2లోపు సమర్పించాలని, ప్రవేశ పరీక్ష 2027 జనవరి 31న జరుగుతుందని పేర్కొన్నారు. ప్రవేశ పరీక్ష విధానం, సిలబస్ నమూనా ప్రశ్నపత్రాలు, మాక్ టెస్టులు, ప్రత్యేక శిక్షణ, ఇతర పూర్తి వివరాల కోసం తిరుపతిలోని వరదరాజనగర్‌లోని విశ్వం సైనిక్ – నవోదయ పోటీ పరీక్షల శిక్షణా కేంద్రాం వారిని 8688888802, 9399976999 సంప్రదించవచ్చని తెలిపారు.
జాతీయ స్థాయి పోటీలకు
తొడతర హైస్కూల్ విద్యార్థులు
తవణంపల్లె : జాతీయ స్థాయి అథ్లెటిక్ పోటీలకు మండలంలోని తొడతర హైస్కూల్ విద్యార్థులు ఎంపికయ్యారు. మంగళవారం ఈ మేరకు ఎంపికై న విద్యార్థులు టి.మహీధర్, డి. ముకేష్‌కుమార్‌ను హెచ్‌ఎం ఖాతుంభీ, ఉపాధ్యాయులు అభినందించారు. పీఆర్‌టీయూ ప్రధాన కార్యదర్శి విజయభాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.
ప్రాంగణ ఎంపికలో
41 మందికి ఉద్యోగాలు
తిరుపతి సిటీ : కరకంబాడి రోడ్డులోని శ్రీరామ అటానమస్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన ప్రాంగణ ఎంపికలలో 41మంది విద్యార్థులకు మంచి ప్యాకేజీతో ఉద్యోగాలు సాధించినట్లు కళాశాల చైర్మన్ మన్నెం రామిరెడ్డి తెలిపారు. మంగళవారం ఓ ప్రముఖ ఐటీ సంస్థ ప్రతినిధులు కళాశాలలో నిర్వహించిన ఇంటర్వ్యూలకు విశేష స్పందన లభించిదని, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని వెల్లడించారు. ఉద్యోగాలకు ఎంపికై న విద్యార్థులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో ఐటీ కంపెనీ ప్రతినిధి ముత్తుస్వామి, కళాశాల సెక్రటరీ మన్నెం రామసుబ్బారెడ్డి, డైరెక్టర్ మన్నెం అరవింద్‌కుమార్ రెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ జయచంద్ర, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.వాసు, ప్లేస్‌మెంట్ అధికారి విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.
సంఘమిత్ర ఎన్నికల ప్రచారం
కార్వేటినగరం : స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓ సంఘ మిత్ర కూటమి తరఫున ప్రచారం నిర్వహించడం మంగళవారం చర్చనీయాంశంగా మారింది. కార్వేటినగరంలో సంఘమిత్రగా పనిచేస్తున్న మహేశ్వరి టీడీపీ తరఫున ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచిపెట్టడంపై గ్రామస్తులు మండిపడ్డారు. నిబంధనలను ఉల్లంఘించిన సంఘమిత్రపై ఎన్నికల అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.


