కాలుడి పాశానికి కష్టజీవులు బలి | - | Sakshi
Sakshi News home page

కాలుడి పాశానికి కష్టజీవులు బలి

Nov 4 2026 1:26 AM | Updated on Nov 4 2026 1:26 AM

● చిత్తూరు మండలం చెర్లోపల్లె వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ● ట్రాక్టర్‌ ట్రాలీని ఢీకొన్న టాటా ఏస్‌ ● ముగ్గురి మృతి

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): మరో నిమిషం వ్యవధి ఉండుంటే ఆ కష్టజీవుల ప్రయాణం సురక్షితంగా సాగిపోయేది. ఎవరి దారిన వారు ఇళ్లకు చేరుకునేవారు. కానీ, కాలం పగబట్టిందో ఏమో కానీ, కాలుడి పాశానికి చిక్కిపోయారు. చిత్తూరు మండలంలోని చెర్లోపల్లె వద్ద సర్వీస్‌ రోడ్డుపై మంగళవారం రాత్రి ట్రాక్టర్‌ ట్రాలీని టాటా ఏస్‌ ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వివరాలు.. తవణంపల్లి మండలం మొదాలపల్లెకు చెందిన చెంచు నాయుడు తన ట్రాక్టర్‌లో పొడవైన రాతి కూసాలను వేసుకుని వెళుతున్నాడు. చెర్లోపల్లి చుట్టుపక్కల రాతి కూసాలు లోడ్‌ చేసుకుని.. తెల్లగుండ్లపల్లి బ్రిడ్జి వద్ద రోడ్డు దాటి మొదాలపల్లికి వెళ్లేందుకు కుడివైపు సర్వీస్‌ రోడ్డులోకి ప్రవేశించాడు. అదే సమయంలో మురుగానిపల్లి వద్ద సరుకు లోడ్‌ చేసుకుని పుంగనూరు వెళ్లి తిరుగు ప్రయాణమైన టాటా ఏస్‌ వాహనం ఇరువారం బ్రిడ్జి నుంచి చెర్లోపల్లి మీదుగా మురుగానిపల్లి వైపునకు ఎడమవైపు సర్వీస్‌ రోడ్డులో వచ్చింది. సర్వీస్‌ రోడ్డులో వీధి దీపాలు లేకపోవడంతో ఆ ప్రాంతమంతా చీకటిగా ఉంది. దీనికితోడు రాతి కూసాలతో వెళ్తున్న ట్రాక్టర్‌ ట్రాలీకి వెనుక భాగంలో ఎలాంటి రేడియం రిఫ్లెక్టివ్‌ స్టిక్కర్లు లేవు. వేగంగా వస్తున్న టాటా ఏస్‌ డ్రైవర్‌ ముందు వెళుతున్న ట్రాక్టర్‌ను గుర్తించలేకపోయాడు. దగ్గరకు వచ్చాక ప్రమాదాన్ని గమనించి వాహనాన్ని కంట్రోల్‌ చేసేలోపే ట్రాక్టర్‌ ట్రాలీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టాడు. ప్రమాద తీవ్రతకు ట్రాక్టర్‌ ట్రాలీలోని రాతి కూసాలు టాటా ఏస్‌ వాహనంలోకి చొచ్చుకుపోయాయి. ఒక రాతి కూసం విరిగి కింద పడగా, మరో కూసం స్టీరింగ్‌ను తీవ్రంగా అదిమివేయడంతో డ్రైవర్‌ సందీప్‌ అక్కడికక్కడే నలిగిపోయాడు. మరో రాతి కూసం పక్కనే కూర్చున్న యువకుడి ప్రాణాలు తీసింది. ఇదే సమయంలో ట్రాక్టర్‌ డ్రైవర్‌ పక్కన కూర్చుని మొదాలపల్లికి వెళ్తున్న టి.బాబు కిందపడి ప్రాణాలు కోల్పోయాడు.

రెక్కాడితే కానీ డొక్కాడని వారే..

ఈ ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురూ రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కష్టజీవులే కావడం గమనార్హం. సందీప్‌ (33) యాదమరి మండలంలోని జోడి చింతలకు చెందిన వాడు. నాలుగేళ్లుగా ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. జితేంద్ర (17), స్వస్థలం బీహార్‌ రాష్ట్రం. పొట్టకూటి కోసం ఇక్కడికి వచ్చిన ఈ బాలుడు విధి వంచనతో మృత్యుఒడికి చేరాడు. అలాగే టి. బాబు (40) తవణంపల్లి మండలం మొదాలపల్లెకు చెందిన దినసరి కూలీ. విషయం తెలుసుకున్న ఈస్ట్‌ సీఐ రామచంద్ర, చిత్తూరు తాలూకా ఎస్‌ఐ అశోక్‌కుమార్‌ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement