ప్రాదేశిక పోరులో
అధికార పార్టీ నాయకులు ప్రజాస్వామ్య సూత్రాలను కాలరాస్తూ, రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా విపక్ష అభ్యర్థులపై, వారి మద్దతుదారులైన సాధారణ ఓటర్లపై బెదిరింపులకు దిగుతున్నారు. పోలీసు వ్యవస్థను అడ్డు పెట్టుకుని భయానక వాతావరణాన్ని
సృష్టిస్తున్నారు. చిత్తూరు కార్పొరేషన్ ఎన్నికలే ఆదర్శంగా తీసుకుని గురువారం జరగబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సైతం
రిగ్గింగ్‌కు సంసిద్ధమయ్యారు.
సాక్షి టాస్క్‌ఫోర్స్: జిల్లా స్థానిక సంస్థల సమరం ముగింపు దశకు చేరుకుంటున్న కొద్దీ అధికార కూటమి నేతల అరాచకాలు, దౌర్జన్యాలు పరాకాష్టకు చేరుతున్నాయి. వైఎస్సార్‌సీపీకి వస్తున్న ప్రజాదరణను తట్టుకోలేక, క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో, తమ ఘోర పరాజయం ఖాయమని తేలిపోవడంతో పచ్చ నేతలు పూర్తిగా అడ్డదారులు తొక్కుతున్నారు. జిల్లా పరిధిలో ఉన్న మొత్తం 27 జెడ్పీటీసీ స్థానాలకు గాను 24 స్థానాల్లో, 370 ఎంపీటీసీ స్థానాలకు గాను 300 స్థానాల్లో ప్రస్తుతం 89 మంది జెడ్పీటీసీ అభ్యర్థుల మధ్య రసవత్తరమైన పోటీ నెలకొంది.
పరిశీలన వేళ..
ప్లాన్–బీ కింద నామినేషన్లు దాఖలయ్యాక పరిశీలన వేళ అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చి అక్రమంగా నామినేషన్లను రద్దు చేయించేందుకు ప్రయత్నించారు. కొన్ని చోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నకిలీ, దొంగ సంతకాలతో విత్‌డ్రా ఫారాలు సృష్టించి నామినేషన్లు ఉపసంహరింపజేసే కుట్రలు చేశారు. అర్ధరాత్రి వేళల్లో అభ్యర్థుల ఇళ్లకు వెళ్లి పోటీ నుంచి తప్పుకుంటే ఎంతైనా ఇస్తామంటూ డబ్బు సంచులు ఎర చూపడం, వినకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించడం వంటి అక్రమాలకు పాల్పడ్డారు. ఇవి కూడా పారకపోవడంతో పచ్చ ముఠాలో తీవ్ర నిరాశ, వణుకు మొదలైంది.
హింసిస్తున్నారు
అధికార పార్టీ అరాచకాలు కేవలం విపక్ష వైఎస్సార్‌సీపీకే పరిమితం కాలేదు. సొంత పార్టీలోనే టిక్కెట్లు దక్కక, అధిష్టానం తీరుపై తీవ్ర అసంతృప్తితో బరిలో నిలిచిన టీడీపీ రెబెల్ అభ్యర్థులను సైతం పచ్చ నేతలు వదలడం లేదు. తమ పార్టీ ఓట్లను చీలుస్తారనే భయంతో రెబెల్స్ లక్ష్యంగా వేధింపుల పర్వాన్ని సాగిస్తున్నారు. వారి పరిధిలో ప్రచారం చేయకుండా అడ్డుకోవడం, పాత గొడవలను తోడి అక్రమ కేసులు బనాయిస్తామని బెదిరించడం, నిరంతరం ఫోన్ల ద్వారా బెదిరింపులకు పాల్పడుతూ వారిని మానసికంగా హింసిస్తున్నారు.
బహిరంగంగా బెదిరింపులు
ప్లాన్– సీకి పదును
ప్లాన్–ఏ, ప్లాన్–బీ విఫలం కావడంతో ఇప్పుడు ఆఖరి ప్రయత్నంగా కూటమి నేతలు ప్లాన్–సీకి పదును పెడుతున్నారు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులైన ఓటర్లను పోలింగ్ బూత్‌లకు రాకుండా భయభ్రాంతులకు గురిచేసేందుకు ఎత్తులు వేస్తున్నారు. ఏకంగా సరిహద్దుల్లో ఉన్న కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి రౌడీలను, గూండాలను జిల్లాలోకి భారీగా దింపి పల్లెల్లో భయాందోళనలు సృష్టించేందుకు సిద్ధమయ్యారు. పోలింగ్ రోజున వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను తప్పించి ఏకపక్షంగా రిగ్గింగ్‌కు పాల్పడేందుకు కుట్రలు పన్నుతున్నారు.
‘పచ్చ’ నేతల కుట్రలు ఇలా..
జిల్లా పరిధిలోని స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన మొదటి రోజు నుంచే కూటమి పెద్దలు రకరకాల కుట్రల పర్వానికి తెరలేపారు. నోటిఫికేషన్ వెలువడగానే వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా పచ్చ మూకలు భౌతిక దాడులకు దిగాయి. అధికారులు, పోలీసుల ముందే నామినేషన్ పత్రాలను లాక్కుని చించివేయడం, కుప్పం, చిత్తూరు, గంగాధర నెల్లూరు, పూతలపట్టు పలమనేరు, నగరి తదితర ప్రాంతాల్లో అభ్యర్థులను కార్యాలయాల వద్దకు రాకుండా అడ్డుకోవడం వంటి అనాగరిక చర్యలకు ఒడిగట్టారు. అయితే వైఎస్సార్‌సీపీ శ్రేణుల తెగువ, ప్రజల మద్దతు ముందు ‘ప్లాన్–ఏ’ ఘోరంగా విఫలమైంది.
పొత్తు..చిత్తు
మరోవైపు, పొత్తు పేరు చెప్పి జిల్లా క్షేత్రస్థాయిలో జనసేన పార్టీని టీడీపీ నేతలు పూర్తిగా పాతాళానికి తొక్కేశారు. మున్సిపల్ ఎన్నికల నుంచి ప్రారంభమైన ఈ పచ్చ ఆధిపత్యం.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక వరకు వచ్చి చేరింది. స్థానిక సంస్థల్లో అన్ని స్థానాలనూ ‘పసుపుమయం’ చేసుకునే క్రమంలో జనసేన అభ్యర్థులను తీవ్రంగా తొక్కిపట్టారు. టీడీపీ నేతల పోరు, వేధింపులు తట్టుకోలేక చాలా చోట్ల జనసేన అభ్యర్థులు బరిలో నిలవకుండానే వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇక ధైర్యం చేసి బరిలో నిలిచిన అభ్యర్థులు కూడా టీడీపీ నేతల కుట్రలకు బలవుతున్నారు. ‘ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని గెలవనివ్వం, పొత్తు కేవలం పైస్థాయిలోనే.. కింద మేం చెప్పిందే వేదం’ అనం టీడీపీ నేతలు బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న జనసేన శ్రేణులు, నేతలు ఎటూ తేల్చుకోలేక, టీడీపీ బెదిరింపులను తట్టుకోలేక తీవ్ర అయోమయంలో మునిగిపోయారు.
ఎన్నికల ప్రచారం ఊపందుకున్న ఈ తరుణంలో టీడీపీ నేతలు తమ ఓటమిని ముందస్తుగానే ఊహించి మరింత దిగజారుతున్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ఇళ్లకు వెళ్లి ప్రచారంలోకి వెళ్లొద్దు.. రూపాయి ఖర్చు పెట్టొద్దు.. అంటూ హుకుం జారీచేస్తున్నారు. అంతేకాకుండా, పోలింగ్ రోజున వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఓటు వేయడానికి బూత్‌లకు వస్తే తీవ్ర పర్యవసానాలు ఉంటాయని బహిరంగంగానే భయపెడుతున్నారు. స్థానిక పోలీసు అధికారులను తమ రాజకీయ స్వార్థానికి వాడుకుంటూ, వారి చేత వైఎస్సార్‌సీపీ నాయకులకు ఫోన్లు చేయించి అక్రమ కేసుల పేరుతో బెదిరింపులకు తెగబడుతున్నారు. చిత్తూరు మేయర్ ఎన్నికలను తమ్ముళ్లు ఆదర్శంగా తీసుకుంటున్నారు. బూతుల్లో ఏజెంట్లు లేకుండా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. లేదంటే.. బెదిరించి రిగ్గింగ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు.


