పాలసముద్రం : ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ప్రజలే ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి పిలుపునిచ్చారు. పాలసముద్రం మండలం ఆముదాల పంచాయతీలో సోమవారం ఆయన వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాలని విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు విఫమయ్యారని తెలిపారు. నేటి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రానున్న అసెంబ్లీ ఎన్నిరలకు పునాది అవుతాయని తెలిపారు. అందువల్ల టీడీపీ గుండాలకు భయపడకుండా వైఎస్సార్ సీపీ మద్దతులో ఎన్నికల బరిలో ఉన్నవారిని గెలిపించుకోవాలని సూచించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నపుడు తన ఐదేళ్ల పాలనలో కులం, మతం, పార్టీ అనే తేడా లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించారని గుర్తుచేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం రెండున్నరేళ్లలో వందలాది మంది మహిళలు భర్త మరణించి పింఛను కోసం నానా అవస్థలు పడుతున్నా పట్టించుకోలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి, మద్యం విక్రయాలు జరుగుతున్నాయన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ పోలీసులు పూర్తిగా విఫలం అయ్యారని, కేవలం వైఎస్సార్ సీపీ శ్రేణులను వేధింపులకు గురిచేయడం, అక్రమ కేసులు బనాయించడంపైనే శ్రద్ధ పెడుతున్నారని మండిపడ్డారు. నేడు రాష్ట్రంలో మహిళలపై, మైనర్ బాలికలపై అత్యాచారాలు ఎక్కువయ్యాయన్నారు. వైఎస్సార్‌సీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలను పోలీసుల ముందే టీడీపీ నాయకులు చించేసినా, వైఎస్సార్ సీసీ నాయకులు, కార్యకర్తలపై దౌర్జన్యాలు చేస్తున్నా పోలీసులు చూసీచూడనట్లు వ్వహరిస్తున్నారు.
వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నేత
ఆముదాలలో టీడీపీ నేత దూర్వాసులు, ఆయన అనుచరులు 10 కుటుంబాలు వారు వైఎస్సార్‌సీపీలో చేరారు. వారికి నారాయణ స్వామి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీసీ జెడ్పీటీసీ అభ్యర్థి నందిని, ఎంపీటీసీ అభ్యర్థి అనురేఖ, మండల కన్వీనర్ తులసీయాదవ్, మాజీ మండల కన్వీనర్ సుందరాజు, పుత్తూరు కేశవరెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు అన్బలగన్, జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి మదివానన్, పారిశ్రామికవేత్త షణ్ముగ యాదవ్, జనార్దన్ నాయుడు, పోలయ్య, వెంకటేష్, మాజీ ఎంపీటీసీ సభ్యులు అరుల్‌లిల్లీ, ధనపాల్, చలయ్య తదితరులు పాల్గొన్నారు.


