● నగలు అపహరణ
పెద్దపంజాణి: ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై గుర్తు తెలియని ఓ యువతి దాడిచేసి నగలు అపహరించుకు వెళ్లిన సంఘటన మండలంలోని పెద్దారికుంట పంచాయతీ గురివిరెడ్డిపల్లి గ్రామంలో సోమవారం వేకువజామున చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని గురివిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన దొరస్వామి భార్య జ్ఞానమ్మ (75) గ్రామం చివరలోని సొంత ఇంటిలో ఒంటరిగా కాపురం ఉంటోంది. సోమవారం వేకువ జామున ఓ యువతి తెలిసిన వ్యక్తిలాగా ఆమెను పేరుతో పిలిచి పసుపు కొమ్ములు కావాలంటూ ఇంట్లోకి వెళ్లింది. పథకం ప్రకారం వెంట తెచ్చుకున్న ఇనుప సుత్తితో వృద్ధురాలి తలపై దాడిచేసింది. వృద్ధురాలు అపస్మారక స్థితికి చేరుకుంది. ఆమె చెవులకున్న బంగారు కమ్మలు, మాటీలు, నల్లపూసల దండ యువతి అపహరించుకు వెళ్లింది. సృహలోకి వచ్చిన తర్వాత ఆమె గట్టిగా కేకలు వేయడంతో గ్రామస్తులు ఆమె ఇంటి వద్దకు చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన ఆమెను చికిత్స నిమిత్తం పుంగనూరులోని ఓ ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. పెద్దపంజాణి పోలీసులు గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు.
ఏపీ ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల గడువు పొడిగింపు
చిత్తూరు కలెక్టరేట్ : ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఏపీ ఓపెన్ స్కూల్) ఆధ్వర్యంలో నిర్వహించే 2026–27 విద్యా సంవత్సరం పదో తరగతి, ఇంటర్మీడియట్ అడ్మిషన్ల గడువును పొడిగించినట్లు డీఈవో లక్ష్మీనారాయణ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా అడ్మిషన్లు పొందేందుకు ఈనెల 15 వ తేదీ వరకు అవకాశం కల్పించారన్నారు. ఈ నెల 16 నుంచి 30 వరకు రూ.200 అపరాధ రుసుంతో అడ్మిషన్లు పొందవచ్చని తెలిపారు. కమిషనర్ ఆదేశాల మేరకు హెచ్ఎంలు, ఎంఈవోలు తమకు నిర్దేశించిన టార్గెట్లను పూర్తిచేయాలని సూచించారు. ఆసక్తి గల అభ్యర్థులు మీసేవ, ఏపీ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ప్రతి మండలంలో ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్ అందుబాటులో ఉందని, ఇతర వివరాలకు డీఈవో కార్యాలయంలోని ఓపెన్ స్కూల్ విభాగంలో సంప్రదించాలని తెలిపారు.
మాతృ, శిశు మరణాలపై సమీక్ష
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో మాతృ, శిశు మరణాల నివారణకు సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నాగ శశిభూషణ్ రెడ్డి ఆదేశించారు. గత మూడు నెలల్లో జిల్లాలో నమోదైన ఒక మాతృ మరణం, 7 శిశు మరణాలపై చిత్తూరు నగరంలోని తన కార్యాలయంలో మంగళవారం ఆయన టాస్క్ఫోర్స్ కమిటీతో ప్రత్యక్ష సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ.. హైరిస్క్ గర్భిణులను ముందుగానే గుర్తించి నిపుణులైన వైద్యులకు చూపించాలన్నారు. అవసరమైతే వారం ముందే ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేర్పించాలని చెప్పారు. మూఢనమ్మకాలు, ముహూర్తాల పేరుతో సిజేరియన్లు చేయవద్దని, సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సరైన పౌష్టికాహారం, నిరంతరం వైద్య పరీక్షలతో రక్తహీనతను నివారించవచ్చన్నారు. ఈ సమావేశంలో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఉషశ్రీ, వైద్యాధికారులు అశోక్ కుమార్, అనూష, వెంకటేశ్వరి, మోహన్ బాబు, ఏఎన్ఎంలు, అంగనన్వాడీ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
బియ్యం అధిక ధరలకు
విక్రయిస్తే కఠిన చర్యలు
జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్
చిత్తూరు కలెక్టరేట్ : బియ్యం అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ హెచ్చరించారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సవరించిన నిబంధనల మేరకు బియ్యాన్ని నిర్దేశిత ధరలకే విక్రయించాలన్నారు. బీపీటీ 3291 సోనా కిలో రూ.66, బీపీటీ 5204 సాంబా కిలో 66, కేఎన్ఎం కిలో రూ.66, హెచ్ఎంటీ కిలో రూ.76, ఆర్ఎన్ఆర్ కిలో రూ.76, జైశ్రీమ్ కిలో రూ.82, ఎంటీయూ కిలో రూ.47 ధరలకే విక్రయించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు. ఒకే రకం బియ్యానికి బ్రాండ్ పేరు, బ్రాండ్ విలువ ఆధారంగా అదనపు ధరలు వసూలు చేయడానికి ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలు క్షేత్రస్థాయిలో అమలయ్యేలా హోల్సేల్, రిటైల్ దుకాణాల్లో నిరంతరం తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్యాకేజ్ బియ్యం బస్తాలపై ముద్రించిన ఎంఆర్పీని పరిశీలించడంతో పాటు, వ్యాపారులు తమ దుకాణాల వద్ద నిర్ణయించిన ధరల వివరాలను స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలని స్పష్టం చేశారు.
పీఎం శ్రీ పాఠశాలల్లో స్కూల్ బ్యాండ్ శిక్షణ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని పీఎం శ్రీ పాఠశాలల్లో స్కూల్ బ్యాండ్ కార్యకలాపాలను మరింత బలోపేతం చేసేందుకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర సమగ్రశిక్ష శాఖ ఎస్పీడీ శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీచేశారు. జిల్లాలో కార్యక్రమం అమలుకు పీఎం శ్రీ పాఠశాలలకు బ్రాస్ బ్యాండ్, పైప్ బ్యాండ్ పరికరాలను అందజేయగా, వాటి సమర్థవంతమైన వినియోగంపై ఉపాధ్యాయులకు నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఎంపిక చేసిన పాఠశాలల్లోని పీఈటీలకు విజయవాడలో ఈ నెల 9 నుంచి 13 వ తేదీ వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎంపిక చేసిన పాఠశాలల నుంచి ఒక్కో పీఈటీ, స్కౌట్ ఉపాధ్యాయుడు విధిగా ఈ శిక్షణకు హాజరుకావాలని స్పష్టం చేశారు. శిక్షణ అనంతరం ఆయా పాఠశాలల్లో బ్యాండ్ కోఆర్డినేటర్లుగా వ్యవహరించి విద్యార్థులకు క్రమం తప్పకుండా శిక్షణ ఇస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


