టీడీపీ అరాచకాల వల్లే ఓటర్లు భయపడ్డారు | - | Sakshi
Sakshi News home page

టీడీపీ అరాచకాల వల్లే ఓటర్లు భయపడ్డారు

Nov 2 2026 1:53 AM | Updated on Nov 2 2026 1:53 AM

● తిరుపతి రాజకీయ చరిత్రలోనే 47 శాతం పోలింగ్‌ అయిన దాఖలాలు లేవు ● తిరుపతి కార్పొరేషన్‌ ఎన్నికలపై భూమన ఫైర్‌

తిరుపతి మంగళం : తిరుపతి కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన దొంగ ఓట్లను వేసుకని గెలిచే గెలుపు గెలుపేనా? అని కర్నూలు, నంద్యాల జిల్లాల వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ భూమన కరుణాకరరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఆదివారం వైఎస్సార్‌సీపీ మేయర్‌ అభ్యర్థి వాసుయాదవ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో టీడీపీ, జనసేన గుండాలు, వేలాది మందిని బయట ప్రాంతాల వారితో దొంగ ఓట్లను వేసుకున్నారని ఆరోపించారు. తిరుపతి నగరంలో 304 బూత్‌లు ఉంటే అందులో 264 బూత్‌లకు పైగా ప్రతి వార్డులోనూ 400 నుంచి 500 దొంగ ఓట్లను వేయించినట్టు ఆరోపించారు. వేలాది మంది బయట ప్రాంత ప్రజలు, ఎర్రచందనం స్మగ్లర్లు, హంతక ముఠాలు, తమ పార్టీ కార్పొరేటర్‌ అభ్యర్థులను, పార్టీ కార్యకర్తలను కొట్టి దౌర్జన్యం చేశారన్నారు. పోలీసులు సమాచారం తెలుసుకుని అక్కడికి వచ్చేసరికే దాడులు చేసి బూతులను ఆక్రమించి 35 వేల దొంగ ఓట్లను వేసుకున్నారని మండిపడ్డారు. ప్రజాభిప్రాయంతో కాకుండా దొంగ ఓట్లతో గెలిచే గెలుపు ఒక గెలుపేనా? అని ప్రశ్నించారు. నాయకులు, కార్యకర్తలను కొట్టడం చూస్తుంటే ప్రజాస్వామ్యమా? లేక రౌడీ రాజ్యమా అన్న ఆలోచన కలుగుతోందన్నారు. ప్రజాస్వామ్య విలువలను మంటగలిపిన చంద్రబాబు, లోకేష్‌, పవన్‌కళ్యాన్‌ సిగ్గుపడాలన్నారు. 35వేల దొంగ ఓట్లు వేసుకున్నా కూడా తిరుపతిలో ఓటింగ్‌ శాతం 47 శాతమే అంటే టీడీపీ గూండాలు చేసే దౌర్జన్యాలు, దాడులతో తిరుపతి నగర ప్రజలు ఎంత భయభ్రాంతులకు గురయ్యారో అర్థమవుతోందన్నారు. తిరుపతిలో ఒక పేదవాడు, బడుగు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఫిజియోథరఫీ డాక్టర్‌ అయిన వాసుదేవయాదవ్‌ను వైఎస్సార్‌సీపీ మేయర్‌ అభ్యర్థిగా నిలబెడితే, ఒక పచ్చి గూండాని, రౌడీని, అరాచకశక్తిని, భూకబ్జాదారుడిని, వేలాది మందిని తీసుకుని వచ్చి రిగ్గింగ్‌ చేయాలన్న ఆలోచన కలిగిన ఒక దుర్మార్గుడిని టీడీపీ మేయర్‌ అభ్యర్థిగా చంద్రబాబు, లోకేష్‌లు నిలబెట్టారన్నారు. తిరుమల తిరుపతి పవిత్రతను మంటగలిపిన చంద్రబాబును తిరుపతి నగర ప్రజలంతా ఛీదరించుకుంటున్నారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement