పింఛన్ల పేరుతో ప్రలోభాలు | - | Sakshi
Sakshi News home page

పింఛన్ల పేరుతో ప్రలోభాలు

Oct 31 2026 6:20 AM | Updated on Oct 31 2026 6:20 AM

● జిల్లాలో యథేచ్ఛగా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన ● పింఛన్ల పంపిణీలో పాల్గొన్న టీడీపీ, జనసేన నాయకులు ● ఓట్లు వేయాలంటూ ప్రచారం, లేదంటే పింఛన్లు ఆపేస్తామంటూ బెదిరింపులు ● ఉలుకూ, పలుకూ లేకుండా మిన్నకుండిపోయిన జిల్లా ఎన్నికల యంత్రాంగం ● ఎన్నికల అధికారుల తీరుపై క్షేత్రస్థాయిలో సర్వత్రా విమర్శలు

ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నప్పటికీ, గుడిపాల మండలం పాపిశెట్టిపల్లి, మోగరాళ్లపల్లి గ్రామాల్లో టీడీపీ నాయకులు సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం రాజకీయ నాయకులు సంక్షేమ పథకాల పంపిణీలో జోక్యం చేసుకోకూడదనే నిబంధనను ఇక్కడ పూర్తిగా విస్మరించారు. పింఛను నగదును లబ్ధిదారులకు అందజేస్తున్న సమయంలోనే కొందరు టీడీపీ నాయకులు కూటమి అభ్యర్థులకే ఓటు వేయాలని బహిరంగంగా ప్రచారం చేశారు. అంతేకాకుండా, ఒకవేళ వేరే పార్టీల వైపు మొగ్గు చూపితే రాబోయే నెలల్లో పింఛన్లు పూర్తిగా నిలిపివేయాల్సి వస్తుందంటూ లబ్ధిదారులను భయభ్రాంతులకు గురిచేస్తూ బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.

చిత్తూరు కలెక్టరేట్‌ : స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌కు గడువు మునుముందుకు వస్తున్న తరుణంలో జిల్లాలో అధికార కూటమి నాయకులు తమ రాజకీయ కుతంత్రాలకు పరాకాష్టను ప్రదర్శిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల నిబంధనలను అపహాస్యం చేస్తూ.. చివరి అంకంలో మరోసారి బరితెగింపు చర్యలకు తెరలేపారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నప్పటికీ, దానిని లెక్కచేయకుండా శుక్రవారం జిల్లా వ్యాప్తంగా సామాజిక పింఛన్ల పంపిణీని అడ్డుపెట్టుకుని ఓటర్లను ప్రలోభపెట్టే నీచ రాజకీయాలకు పాల్పడ్డారు.

నామినేషన్ల నుంచి అరాచకాల పరంపర

స్థానిక సంస్థల ఎన్నికల్లో విపక్ష అభ్యర్థులు కనీసం నామినేషన్లు సైతం దాఖలు చేయకుండా చేసేందుకు అధికార పార్టీ నాయకులు కుట్రలు పన్నారు. నామినేషన్‌ కేంద్రాల వద్ద దౌర్జన్యాలు చేయడం, పత్రాలు లాక్కోవడం, చించేయడం, పరిశీలన పేరుతో అభ్యర్థు ల పేర్లు తొలగించడం, బలవంతపు ఉపసంహరణల కు పాల్పడి ప్రజాస్వామ్యం గొంతు నులిమారు. నామినేషన్ల పర్వంలో అరాచకంగా వ్యవహరించిన పచ్చ ముఠాలు ఇప్పుడు పోలింగ్‌కు కొద్ది గంటల ముందు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పింఛన్లను అస్త్రంగా మలుచుకున్నాయి. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నప్పటికీ జిల్లా వ్యాప్తంగా టీడీపీ, జనసేన నాయకులు స్వయంగా రంగంలోకి దిగి పింఛన్లు పంపిణీ చేస్తూ ఓటర్లను బెదిరిస్తున్నారు.

గ్రామాల్లో బెదిరింపులు

నిబంధనల ప్రకారం ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నప్పు డు ఏ రాజకీయ నాయకుడు సంక్షేమ పథకాల పంపిణీలో జోక్యం చేసుకోకూడదు. కానీ దీనిని పూర్తిగా తుంగలో తొక్కిన టీడీపీ నాయకులు.. గుడిపాల మండలం పాపిశెట్టిపల్లి, మోగరాళ్లపల్లి గ్రామాల్లో స్వయంగా స్వయంగా పింఛన్లు పంచుతూ కూటమి అభ్య ర్థులకే ఓటువేయాలని ప్రచారం సాగించారు. లేకపోతే వచ్చే నెల నుంచి పింఛన్లు నిలిపివేస్తామంటూ లబ్ధిదారులను భయభ్రాంతులకు గురిచేశారు. మరోవైపు పుంగనూరు నియోజకవర్గం రొంపిచెర్ల మండలంలోనూ ఎన్నికల కోడ్‌కు వ్యతిరేకంగా పింఛన్ల పంపిణీ పేరుతో ప్రచారం చేస్తున్నారంటూ వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి కోట సుష్మ ఎన్నికల అధికారులకు ఆధారాలతో సహా రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ జిల్లా ఎన్నికల అధికారులు స్పందించకపోవడం గమనార్హం.

పట్టించుకోని ఎన్నికల అధికారులు

కూటమి నాయకులు యథేచ్ఛగా నిబంధనలను ఉల్లంఘిస్తూ, ఓటర్లను బెదిరిస్తుంటే.. జిల్లా ఎన్నికల అధికారులు మాత్రం తమకేం పట్టనట్లు చోద్యం చూస్తున్నారు. ఎన్నికల కోడ్‌ను పటిష్టంగా అమలుచేయడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని పో టీలో ఉన్న వివిధ పార్టీల అభ్యర్థులు, ప్రజా సంఘాల నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ సాగుతున్న ఈ అక్రమాలకు ఎన్నికల సంఘం అడ్డుకట్ట వేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

బంగారుపాళ్యం మండలంలో పింఛన్లు పంపిణీ చేస్తున్న జనసేన నాయకుడు

గుడిపాల మండలంలో పింఛన్లు పంపిణీ చేస్తున్న టీడీపీ నాయకుడు

గుడిపాల మండలంలో పింఛన్ల పంపిణీ ముసుగులో బెదిరింపులు

రొంపిచెర్ల మండలంలో కోడ్‌ ఉల్లంఘనపై వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి ఫిర్యాదు

రొంపిచెర్ల మండలంలోనూ పింఛన్ల పంపిణీ ప్రక్రియను అడ్డుపెట్టుకుని ఓటర్లను ప్రభావితం చేసేందుకు అధికార పార్టీ వర్గాలు ప్రయత్నించాయి. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా పింఛన్ల పంపిణీని రాజకీయ ప్రచార అస్త్రంగా మలుచుకోవడంపై స్థానిక అభ్యర్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్‌ను అడ్డగోలుగా ఉల్లంఘిస్తూ పింఛన్ల పేరుతో ఓటర్లను ప్రలోభపెడుతున్న తీరుపై రొంపిచెర్ల మండల వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి కోట సుష్మ ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలతో సహా అధికారులకు రాతపూర్వక ఫిర్యాదు అందజేసి, తక్ష ణ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

హడావుడిగా పింఛను నిధుల పంపిణీ

జిల్లా వ్యాప్తంగా శుక్రవారం మొత్తం 2,29,468 మందికి పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉండగా.. టీడీపీ నాయకుల కనుసన్నల్లో హడావుడిగా 2,04,603 మందికి పంపిణీ పూర్తి చేశారు. ఇందుకోసం రూ.99.26 కోట్లు విడుదల చేయగా, ఒక్కరోజే రూ.87.85 కోట్లను పంపిణీ చేశారు. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేయడానికే ఈ పంపిణీ ప్రక్రియను నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement