రేపు మున్సిపల్ ఎన్నికల పోలింగ్
నవంబర్ 3 న ఓట్ల లెక్కింపు
జిల్లాలో 163 బీఎన్‌ఎస్‌ఎస్
(144 సెక్షన్) అమల్లోకి
పోలింగ్ కేంద్రాల వద్ద 200 మీటర్లు, కౌంటింగ్ కేంద్రాల వద్ద 2 కి.మీ
పరిధిలో ఆంక్షలు
ఉత్తర్వులు జారీచేసిన జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ గాంధీ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల 2వ సాధారణ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఆ ఉత్తర్వుల మేరకు జిల్లాలో నవంబర్ 1 వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారన్నారు. ఒకవేళ అవసరమైతే నవంబర్ 2వ తేదీన ఉదయం 7:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు నిర్వహిస్తారు. నవంబర్ 3వ తేదీన ఉదయం 8:00 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తామని పేర్కొన్నారు. జిల్లాలోని చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, పలమనేరు మున్సిపాలిటీ (ఎస్‌వీసీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో), నగరి మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ తిరుపతి జిల్లా పుత్తూరులో ఉన్న సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో, కుప్పం మున్సిపాలిటీకి సంబంధించి (కుప్పం ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో) నిర్వహిస్తారని తెలియజేశారు.
నిషేధాజ్ఞలు, పటిష్ట భద్రత
శాంతిభద్రతల పరిరక్షణకు భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్), 2023లోని సెక్షన్ 163 (గతంలో 144 సెక్షన్) అమలు చేస్తున్నట్లు పేర్కొ న్నారు. పోలింగ్ రోజున (నవంబర్ 1) ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అన్ని పోలింగ్ కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో గుమిగూడడం సభలు, ర్యాలీలు, ఐదుగురికి మించి వ్యక్తులు తిరగడాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు తెలిపారు. అలాగే నవంబర్ 3వ తేదీన ఓట్ల లెక్కింపు ఫలితాల ప్రకటన జరిగే కౌంటింగ్ కేంద్రాల చుట్టూ 2 కిలోమీటర్ల పరిధిలో గుంపులుగా తిరగడం, సమావేశాలు నిర్వహించడంపై నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. ఈ నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారని జిల్లా ఎన్నికల అధికారి ఆ ఉత్తర్వుల్లో హెచ్చరించారు.


