సాక్షి, చిత్తూరు: పూతలపట్టు నియోజకవర్గానికి చెందిన ఖాదర్‌బాషా వైఎస్సార్‌సీపీ మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి నియమితులయ్యా రు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శుక్రవారం ఆదేశాలు ఆమేరకు ఖాదర్‌బాషా రాష్ట్ర కమిటీలో స్థానం కల్పించినట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.
అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు
యాదమరి: ఇంటి ఆవరణలో ప్రవేశించి మేకను ఎత్తుకెళ్లిన ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను శుక్రవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి దొంగలించిన ఒక మేకపోతుతో పాటు, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు..ఈ నెల 27న మండల పరిధిలోని కట్టకిందవూరు గ్రామంలో ఓ ఇంటి ఆవరణలో గేటు తాళాన్ని పగులగొట్టి మేకపోతును అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు, విచారణలో భాగంగా గురువారం తుమ్మిందపాళ్యం క్రాస్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ద్విచక్రవాహనంపై మేకపోతును తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా నిందితులు నేరం అంగీకరించారు. నిందితులు తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా పరదరామికి చెందిన హరి, శివగా గుర్తించారు. వారి నుంచి మేకపోతు, ఒక ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించింది.
వేటకు వెళ్లి
అనంత లోకాలకు..
యాదమరి: అడవి పందులను వేటాడేందుకు వెళ్లి పొలాల్లో అమర్చిన విద్యుత్ తీగ తగిలి ఓ వ్యక్తి శుక్రవారం మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. మండల పరిధిలోని పాచి గుంట గ్రామానికి చెందిన రవి కుమారుడు వేణు(34)ను తన ఇద్దరు మిత్రులు గురువారం రాత్రి అడవి పందుల వేట కోసం గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలాల వద్దకు తీసుకెళ్లా రు. అక్కడ పందులను వేటాడేందుకు విద్యుత్ స్తంభంలోని తీగల నుంచి ఇనుప బైండింగ్ వైరును అమర్చారు. ఈ క్రమంలో వేణు ప్రమాదవశాత్తు ఆ విద్యుత్తు తీగను తాకడంతో విద్యుత్ షాక్‌తో అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వన్యప్రాణుల వేట కోసం పొలాల్లో విద్యుత్ తీగలు అమర్చడం చట్టరీత్యా నేరమని, పొలాల్లో అక్రమంగా విద్యుత్ తీగలు అమర్చినట్లు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని వారు కోరారు.
విద్యార్థినులతో ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన !
వి.కోట : పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినుల పట్ల ఓ ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. పాఠశాలలో చదువుకుంటున్న కొందరు విద్యార్థినులు ఉపాధ్యాయుడి ప్రవర్తనపై తీవ్ర అంసతృప్తి వ్యక్తం చేస్తూ ఆ పాఠశాల కమిటీ సభ్యురాలి దృష్టికి సమస్యను తీసుకెళ్లినట్లు సమాచారం. ఆ పాఠశాలలో కామర్స్ లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు రావడంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థినుల ఫిర్యా దుపై విద్యాశాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.


