చిత్తూరు కార్పొరేషన్: 18 ఏళ్లు నిండిన పౌరుల కు రాజ్యాంగం ఓటు హ క్కు కల్పించింది. భారత ఎన్నికల సంఘం నిబంధనలు, రాజ్యాంగం మేరకు ఓటర్లు తమ ఓటును వినియోగించుకునే పద్ధతులు కూడా ఉన్నాయి.
సాధారణ ఓటు: ఈవీఎం, బ్యాలెట్‌తో వేసేది.
పోస్టల్: ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, అత్యవసర సేవల సిబ్బంది పోలింగ్ రోజున, సొంత నియోజకవర్గంలో ఓటు వేయలేరు. అందువల్ల వీరు ఎన్నికల తేదీకి ముందే పోస్టు, ప్రత్యేక కేంద్రాల ద్వారా ఓటు వేస్తారు.
సర్వీస్: త్రివిధ దళాల్లో పనిచేసే జవాన్లు, విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది తమ విధుల్లో ఉంటూనే ప్రత్యేకంగా ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్‌మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ ద్వారా వేసే ఓటు.
ప్రాక్సీ: పోలింగ్ కేంద్రానికి స్వయంగా రాలేని సర్వీస్ ఓటర్లు.. తమ తరఫున ఓటు వేసేందుకు కుటుంబంలో ఒకరిని ప్రతినిధిగా (ప్రాక్సీ) నియమించవచ్చు. ఆ ప్రతినిధి వచ్చి వేసే దాన్ని ప్రాక్సీ ఓటు అంటారు.
టెండర్: ఓటరు పోలింగ్ కేంద్రానికి వెళ్లే సరికి, అతని ఓటును అప్పటికే ఎవరో దొంగ ఓటుగా వేసినట్లయితే.. అసలు ఓటరు తన గుర్తింపును నిరూపించుకుని ప్రత్యేక బ్యాలెట్ పేపరు ద్వారా వేసే ఓటు. వీటిని సాధారణ కౌంటింగ్‌లో లెక్కించరు. గెలుపోటములు తేడా తక్కువగా ఉన్నప్పుడు కోర్టు ఆదేశాల మేరకు లెక్కిస్తారు.
ఛాలెంజ్: పోలింగ్ కేంద్రంలో ఓటరు గుర్తింపుపై అక్కడున్న పోలింగ్ ఏజెంట్‌కు ఏవైనా అనుమానాలు ఉంటే, వారు నిర్ణీత రుసుం చెల్లించి సవాలు చేయవచ్చు. అప్పుడు పోలింగ్ అధికారి విచారణ జరిపి, ఓటరు నిజమైన వారే నిర్ధారిస్తే వేయించే ఓటును ఛాలెంజ్ ఓటు అంటారు.


