న్యాయస్థానాన్ని అవమానిస్తారా? | - | Sakshi
Sakshi News home page

న్యాయస్థానాన్ని అవమానిస్తారా?

Oct 30 2026 1:27 AM | Updated on Oct 30 2026 1:27 AM

వెన్నుపోటు పొడిచి పార్టీలు మారిన వ్యక్తికి టికెట్‌ ఇవ్వడానికి ఎమ్మెల్యే భానుకు సిగ్గులేదా? జనసేనలో బీసీలే లేరా? బలిజలను అవమానించిన వారికి బుద్ధి చెప్పండి మాజీ మంత్రి ఆర్కే రోజా ఫైర్‌

పుత్తూరు: వైఎస్సార్‌ సీపీకి వెన్నుపోటు పొడిచి టీడీపీ పంచన చేరిన వ్యక్తికి జనసేన కండువా కప్పి ఎన్నికల బరిలో దింపడానికి ఎమ్మెల్యే భానుప్రకాష్‌కు సిగ్గులేదా అని మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రశ్నించారు. జనసేన పార్టీలో బీసీలే లేరా అంటూ నిలదీశారు. ఆమె గురువారం మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక ఆరేటమ్మ ఆలయం నుంచి నగరం రోడ్డు, బజారువీధి, తేరువీధి, తిరుపతి రోడ్డు మీదుగా ఎస్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరకు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ తమ మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ అభ్యర్థి జయప్రకాష్‌కు బీసీ సర్టిఫికెట్‌ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. తాము హైకోర్టును ఆశ్రయిస్తే సర్టిఫికెట్లను పరిశీలించిన న్యాయస్థానం జయప్రకాష్‌కు బీసీ సర్టిఫికెట్‌ మంజూరు చేసిందని వివరించారు. దీనిపై ఎమ్మెల్యే భానుప్రకాష్‌ మాట్లాడుతూ దొంగ సర్టిఫికెట్‌ అంటూ న్యాయ స్థానాన్ని, బలిజ కమ్యూనిటీని అవమానిస్తూ మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అభ్యర్థి జయప్రకాష్‌ పార్టీ కోసం పనిచేసి, కౌన్సిలర్‌గా గెలిచి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌గా ప్రజలకు సేవలందించారని కొనియాడారు. అలాంటి వ్యక్తి తమ అభ్యర్థి అని తెలిసిన వెంటనే తడిసి పోయిన టీడీపీ నేతలకు ఆయన్ని అడ్డుకోవడానికి బీసీ సర్టిఫికెట్‌ ఇవ్వకుండా పలు ఇబ్బందులు పెట్టారని తెలిపారు. ఇలా బలిజ కమ్యూనిటీని అవమానకరంగా మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యేకు ఎన్నికల్లో తగిన రీతిలో బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు.

రెండున్నరేళ్లలో అభివృద్ధి శూన్యం

చంద్రబాబు ప్రభుత్వంలో రెండున్నరేళ్లలో అభివృధ్ది శూన్యమని రోజా ఎద్దేవా చేశారు. జగన్న ప్రభుత్వం అమలైన సంక్షేమ పథకాలకు రెట్టింపు ఇస్తానని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు అన్నింటినీ అటకెక్కించారని మండిపడ్డారు. వలంటీర్ల వేతనాన్ని రూ.10 వేలు ఇస్తానని నిలువునా మోసం చేశారని గుర్తు చేశారు. ఇలా అన్ని వర్గాలను నిలువునా మోసం చేసిన టీడీపీ, జనసేన పార్టీలను చిత్తు చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.

జగనన్న పాలనలోనే అభివృద్ధి

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు పుత్తూరులో పలు శాశ్వత అభివృద్ధి పనులు చేసినట్టు రోజా గుర్తు చేశారు. మున్సిపల్‌ పార్క్‌, పాలిటెక్నిక్‌ కళాశాల, మున్సిపల్‌ భవనం, షాదీమహల్‌, ధర్మరాజుల ఆలయ రాజగోపురం, విద్యుత్‌ దహనవాటికి, ఈశ్వరాలయం పుష్కరిణి తదితర పనులు చేశామన్నారు. మున్సిపాలిటీలోని ప్రతి వార్డులోనూ ఓటు అడిగే హక్కు ఒక్క వైఎస్సార్‌ సీపీకే ఉందన్నారు. వంద పడల ఆసుపత్రి మంజూరుకు అన్ని ఏర్పాట్లు చేస్తే, లెటర్లు రాసి ఆపించిన ఘనత ఎమ్మెల్యేదని దుయ్యబట్టారు. మళ్లీ మన ప్రభుత్వం వస్తుందని, మనమే పుత్తూరు వంద పడకల ఆస్పత్రిని నిర్మిస్తామని స్పష్టం చేశారు. రైల్వే సబ్‌వే, నేషనల్‌ హైవే పనులు సైతం కేంద్ర మంత్రి నితీష్‌గడ్కరితో మాట్లాడి తాను చేయించిందేనని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement