బియ్యం.. బరువు..! | - | Sakshi
Sakshi News home page

బియ్యం.. బరువు..!

Oct 29 2026 2:18 AM | Updated on Oct 29 2026 2:18 AM

అమాంతం పెరిగిన బియ్యం ధరలు

సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న వైనం

మూడు నెలల్లోనే బ్యాగుపై రూ.300 నుంచి రూ.700 వరకు పెంపు

బ్రాండెడ్‌ రకాలు రూ.2 వేలకు పైమాటే

మిల్లర్ల సిండికేట్‌, కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరే కారణం

బియ్యం ధరలు అమాంతం పెరిగిపోయాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా మూడు నెలల్లోనే 25 కేజీల బ్యాగుపై రూ.300 నుంచి రూ.700 వరకు ధరలు పెరగడం తీవ్ర కలకలం రేపుతోంది. మంచి బ్రాండెడ్‌ సన్న బియ్యం బ్యాగు ధర ఇప్పటికే రూ.2,000 మార్కును దాటింది. పేదలు, మధ్యతరగతి వర్గాలు ఎక్కువగా వాడే మంచి రకాల బ్యాగు ధర గతంలో రూ.1,700 నుంచి రూ.1,900 వరకు ఉండగా ప్రస్తుతం రూ.2,600 మార్కును దాటింది. మిల్లర్ల సిండికేట్‌, కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

కాణిపాకం: చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లో 400లకు పైగా బియ్యం షాపులు, గ్రామీణ ప్రాంతాల్లో 1,500 మందికి పైగా చిన్నపాటి బియ్యం వ్యాపారులు ఉన్నారు. గతంలో జిల్లాలో రోజువారి సుమారు 8 వేల బ్యాగుల వరకు విక్రయాలు జరిగేవి. ప్రస్తుతం పెరిగిన ధరల భయంతో ప్రజలు కొనుగోళ్లు తగ్గించుకోవడంతో విక్రయాలు రోజుకు 6 వేల బ్యాగులకు పడిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. జిల్లాలో వరి సాగు 20 వేల హెక్టార్లకే పరిమితం కావడం, పండిన కొద్దిపాటి పంటను కూడా రైతులు సొంత ఇంటి అవసరాలకు, స్థానిక విక్రయాలకే పరిమితం చేసుకోవడంతో జిల్లా మార్కెట్‌ పూర్తిగా బయటి ప్రాంతాలపైనే ఆధారపడాల్సి వస్తోంది.

రేషన్‌ బియ్యం రీ–పాలిషింగ్‌ దందా

సాధారణ మార్కెట్‌లో బియ్యం ధరలు ఎక్కువగా ఉండడంతో పేదలు వేరే దారి లేక రేషన్‌ బియ్యంపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఇదే అవకాశంగా భావించిన కొంతమంది అక్రమార్కులు రేషన్‌ బియ్యాన్ని దొడ్డిదారిన సేకరించి రీ–పాలిషింగ్‌ చేస్తున్నారు. వీటిని మార్కెట్‌లో బ్యాగు రూ.1,500 నుంచి రూ.1,600 వరకు విక్రయిస్తున్నారు.

చోద్యం చూస్తున్న ప్రభుత్వం

నిత్యావసర ధరలు చుక్కలనంటుతున్నా కూటమి ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. వ్యాపారులు, మిల్లర్లు అడ్డగోలుగా ధరలు పెంచుతున్నా నివారణ చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ నిల్వలపై తనిఖీలు చేసి, కృత్రిమ కొరతను అరికట్టాల్సిన అధికారులు కనీసం స్పందించకపోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం జోక్యం చేసుకుని బియ్యం ధరలను అదుపులోకి తీసుకురావాలని, నిల్వలపై దాడులు నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

బియ్యం ప్రస్తుత మూడు నెలల

రకం ధర (రూ.) క్రితం (రూ.)

జోకర్‌ 2,600 1,700–1,900

జీఎంఆర్‌ సాగర్‌ 2,300 1,600–1,800

సూర్య 2,000 1,500–1,750

ఇండియన్‌ గేట్‌ 1,900 1,400–1,700

బుల్లెట్‌ 1,850 1,550–1,650

ఆహార్‌ 1,850 1,550–1,650

వైష్ణవి 1,800 1,500–1,600

మిల్లర్ల సిండికేట్‌

జిల్లాలోని బియ్యం డిపోలకు ప్రధానంగా తెలంగాణలోని మిర్యాలగూడ నుంచి అధికంగా సరుకు వస్తుంది. ఆ తర్వాత నెల్లూరు, గోదావరి జిల్లాలు, గుంటూరు ప్రాంతాల నుంచి దిగుమతి అవుతుంది. గతంలో అక్కడి మిల్లర్లు అడిగినంత మేర సప్లయి చేసేవారని, ప్రస్తుతం ఎంత ఆర్డర్‌ ఇచ్చినా అరకొరగానే పంపుతున్నారని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. ఓ వైపు ఎల్‌నినో ప్రభావం కాగా, మరోవైపు కూటమి ప్రభుత్వం వరి ధాన్యం పండించవద్దంటూ రైతులకు చెప్పడంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయిందని వారు మండిపడుతున్నారు. దీనికితోడు మిల్లర్లు సిండికేట్‌గా ఏర్పడి కృత్రిమ కొరతను సృష్టిస్తూ ఎక్కడా లేని డిమాండ్‌ను తీసుకొచ్చి ధరలను విపరీతంగా పెంచేస్తున్నారని వ్యాపారులతో పాటు సామాన్య ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement