చిత్తూరు రూరల్ (కాణిపాకం): రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించడమే లక్ష్యంగా జిల్లా పోలీసు శాఖ బుధవారం జిల్లా వ్యాప్తంగా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించింది. పోలీసులు ప్రజలతో మాట్లాడి ఎన్నికల సమయంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ, ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని సూచించారు. గొడవలకు దిగడం, ప్రత్యర్థులపై దాడులకు పాల్పడడం, బెదిరింపులు, రెచ్చగొట్టడం తదితర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. లేనిపక్షంలో చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రలోభాలకు, ఒత్తిళ్లకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎన్నికలకు సంబంధించిన సమస్యలు లేదా అవాంఛనీయ ఘటనలు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
సమస్యాత్మక పోలింగ్
కేంద్రాలపై ప్రత్యేక దృష్టి
చిత్తూరు కార్పొరేషన్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల భద్రతపై అధికారులు దృష్టి పెట్టారు. జిల్లాలో మొత్తం 1,236 పోలింగ్ కేంద్రాలుండగా అందులో 366 సమస్యాత్మక, 277 అత్యంత సమస్యాత్మక, 69 అత్యంత సున్నిత పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. ఆ ప్రాంతాల్లో ఎటువంటి గొడవలు జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని జెడ్పీ అధికారులు పోలీసుశాఖకు నివేదిక పంపించారు. మిగిలిన 524 సాధారణ పోలింగ్ కేంద్రాల్లో రక్షణ ఏర్పాటు చేయాలని కోరారు. సాధారణ కేంద్రాల్లో ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పోలీసు బందోబస్తుతో పాటు ఓటర్లకు అవసరమైన కనీస సదుపాయాలు కల్పించడానికి ఏర్పాట్లు చేపట్టే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. సమస్యాత్మక కేంద్రాల్లో పరిస్థితుల తీవ్రతను బట్టి అదనపు పోలీసు బందోబస్తు, వీడియో చిత్రీకరణ, వెబ్‌కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణ వంటి చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. పోలింగ్ ప్రక్రియను ఉన్నతాధికారులు పర్యవేక్షించేందుకు వీలుగా అవసరమైన సాంకేతిక ఏర్పాట్లు చేయనున్నారు.
ఉత్తమ శాస్త్రవేత్తకు అభినందన
తిరుపతి సిటీ : ఎస్వీయూ రసాయన శాస్త్ర విభాగం అధ్యాపకుడు ప్రొఫెసర్ సురేష్ రెడ్డి స్కాలర్లీ ఇండెక్స్ రూపొందించిన టాప్ థౌజండ్ పరిశోధకులలో 29వ ర్యాంక్ సొంతం చేసుకున్నారు. ఆయన రసాయన శాస్త్ర విభాగంలో అనేక రీసెర్చ్ ప్రాజెక్ట్‌లను పొందటమే కాక 47 మంది విద్యార్థుల పీహెచ్‌డీకి పరిశోధకుడిగా వ్యవహరించారు. 353 పరిశోధనా పత్రాలను అత్యుత్తమ జర్నల్స్‌లో పబ్లిష్ అయ్యాయి. బుధవారం ఈ సందర్భంగా ప్రొఫెసర్ సురేష్ రెడ్డిని వీసీ నర్సింగరావు, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పద్మావతి, రసాయన శాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ వైవీ రామిరెడ్డి అభినందించారు.


