ఓటరుపై పొంగిపొర్లుతున్న అభిమానం! | - | Sakshi
Sakshi News home page

ఓటరుపై పొంగిపొర్లుతున్న అభిమానం!

Oct 30 2026 1:27 AM | Updated on Oct 30 2026 1:27 AM

● రెండున్నరేళ్లుగా కనిపించని ప్రజాసేవ ● ఎన్నికల వేళ వీధివీధికీ పరుగులు!

సాక్షి టాస్క్‌ ఫోర్స్‌ : అధికారం ఉన్నప్పుడు ప్రజల కష్టాలు కనిపించవు. ఎన్నికల సందడి మొదలవగానే ఓటరుపై అభిమానం పొంగిపొర్లుతోంది. రెండున్నరేళ్లుగా ప్రజలకు ఏం కావాలి? ఎక్కడ సమస్యలున్నాయి? తాగునీటి ఇబ్బందులు ఉన్నాయా? కాలువలు శుభ్రంగా ఉన్నాయా? రోడ్లు బాగున్నాయా? అన్న విషయాలను పట్టించుకున్న నాథుడే కనిపించలేదు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నిన్నటి వరకు కనిపించని నేతలు.. నేడు వీధివీధికీ ప్రత్యక్షమవుతున్నారు. తాగునీటి కోసం ప్రజలు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోని నాయకులు.. ఇప్పుడు ఓటరు అడిగిందే తడవుగా వాటర్‌ ట్యాంకర్లను వీధుల్లోకి పంపిస్తున్నారు. ప్రజల దాహం తీర్చాలన్న ఆలోచన ఇప్పుడే వచ్చిందా? లేక ఓటు విలువ ఇప్పుడే తెలిసొచ్చిందా? అన్న ప్రశ్నలు స్థానికంగా వినిపిస్తున్నాయి. నెలల తరబడి మురుగుతో నిండిపోయిన కాలువలు.. కంపు కొడుతున్న వీధులు.. పట్టించుకునేవారు లేక ఇబ్బందులు పడిన స్థానికులు.. ఇవన్నీ ఇప్పుడు నేతల దృష్టిలోకి వచ్చేశాయి. పారిశుద్ధ్య పనులు చురుగ్గా సాగుతున్నాయి. కాలువల్లో పేరుకుపోయిన చెత్తను తొలగిస్తున్నారు. ఇన్నాళ్లూ కనిపించని పారిశుద్ధ్య సిబ్బంది ఇప్పుడు వీధుల్లో సందడి చేస్తున్నారు. ప్రజారోగ్యంపై ఈ శ్రద్ధ ఏడాది పొడవునా ఉంటే ఎంత బాగుండేదోనని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎప్పటినుంచో మిట్టపల్లాలతో వాహనదారులను ఇబ్బంది పెడుతున్న రహదారులకు ఇప్పుడు మరమ్మతుల హడావుడి మొదలైంది. ఓటర్లు అధికంగా ఉన్న నివాస ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టేశారు. అక్కడ చిన్న సమస్య తలెత్తినా వెంటనే స్పందన.. ఎవరైనా ఇబ్బంది అని చెప్పినా తక్షణ చర్యలు.. ఓటర్లు ఎక్కువగా ఉన్న వీధుల్లో ఈగ కూడా వాలనివ్వకుండా కాపలా కాస్తున్నారన్నంతగా నేతల హడావుడి కనిపిస్తోంది. ప్రజాసేవ అనేది ఎన్నికల సమయంలో మాత్రమే గుర్తుకొచ్చే కార్యక్రమం కాదు. తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు వంటి కనీస వసతులు ప్రజలకు నిరంతరం అందాల్సిన బాధ్యత. ఎన్నికల సీజన్‌లో కనిపించే హడావుడి కాదు.. ఎన్నికల వేళ పొంగిపొర్లుతున్న ఈ అభిమానం.. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఇలాగే కొనసాగుతుందా? లేక ఓటు పెట్టెల్లో పడగానే మళ్లీ పాత నిర్లక్ష్యమే దర్శనమిస్తుందా? అన్నది వేచి చూడాల్సిందే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement