విత్తు చిత్తైంది! | - | Sakshi
Sakshi News home page

విత్తు చిత్తైంది!

Oct 29 2026 2:18 AM | Updated on Oct 29 2026 2:18 AM

జిల్లాలో వేరుశనగ పంట ఢమాల్‌ ఎల్‌నినో ఎఫెక్ట్‌, వర్షాభావంతో కుదేలైన సాగు బూడిదలో పోసిన పన్నీరైన పెట్టుబడి నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతన్నల ఆవేదన

కాణిపాకం: చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది వేరుశనగ సాగు పూర్తిగా పాతాళానికి పడిపోయింది. సాధారణ విస్తీర్ణం 21 వేల హెక్టార్లు కాగా 5 వేల హెక్టార్లలో మాత్రమే వేరుశనగ సాగైనట్లు అధికారులు చెబుతున్నారు. సుమారు 17 వేల మంది రైతులు ఈ పంటను నమ్ముకుని విత్తనాలు వేశారు. కుప్పం, శాంతిపురం, జీడీనెల్లూరు, వెదురుకుప్పం, రొంపిచెర్ల, కార్వేటినగరం, పెనుమూరు, యాదమరి, గుడిపాల, చిత్తూరు తదితర మండలాల్లో పంట అంతంతమాత్రంగా పర్వాలేదనిపించింది. మిగిలిన మండలాల్లో వర్షాభావ పరిస్థితుల కారణంగా విత్తనం మొలకెత్తడమే గగనమైంది.

ప్రభుత్వ రాయితీ విత్తనాలకు మంగళం

పంట సాగు సమయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు రైతన్నల ఆశలపై నీళ్లు చల్లింది. రాయితీ విత్తనాలు సకాలంలో అందకపోవడంతో రైతులు బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఇది చాలదన్నట్లు ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవకపోవడంతో సాగు తగ్గింది. వేసిన పంట కూడా తీవ్ర ఎండలకు మాడిపోయింది. బోర్ల కింద నీటి వసతి ఉన్న కొద్దిమంది రైతులు మాత్రమే నానా తంటాలు పడి పంటను ఏదోలా కాపాడుకున్నారు. మిగిలిన రైతులు వర్షాధారంగా పంటను కోల్పోయి నిస్సహాయ స్థితిలో మిగిలిపోయారు.

చెట్టుకు కాయలు నిల్‌..

సాధారణంగా ఎకరా వేరుశనగ పంటకు 15 బ్యాగుల (ఒక బ్యాగు 40 కేజీలు) వరకు దిగుబడి రావాలి. ఈసారి చెట్టుకు కాయలు కనిపించడం లేదు. ఒకటి రెండు గట్టి కాయలు మినహా మిగిలినవన్నీ ఊడలు, డొల్ల కాయలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎకరాకు కనీసం ఒక్క బ్యాగు కాయలు కూడా దిగుబడి రావడం లేదని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.

రూ. 30 వేల పెట్టుబడి బూడిదలో

ఎకరా వేరుశనగ పంట సాగు చేయడానికి రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు రైతులు పెట్టుబడి పెట్టారు. పంట చేతికి వచ్చిన పంటను చూస్తే పెట్టుబడిలో కనీసం పది శాతం కూడా వెనక్కి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అప్పులు చేసి పంట సాగు చేశామని, ఇప్పుడు వాటిని ఎలా తీర్చాలో తెలియడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు.

అన్నదాతను కష్టాలు వీడడం లేదు. వ్యవసాయం జూదంగా మారుతూ ప్రతిఏటా అప్పుల పాలు చేస్తూనే ఉంది. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో వేరుశనగ రైతులను ప్రకృతితో పాటు ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా కోలుకోలేని దెబ్బతీసింది. సాగు ఆశలతో మొదలైన అన్నదాత ప్రయాణం చివరకు పెట్టుబడులు కూడా చేతికి అందక అప్పులపాలు చేసింది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవకపోవడం, ప్రభుత్వ వైఫల్యాలు వెరసి జిల్లాలో వేరుశనగ పంటను పూర్తిగా సర్వనాశనం చేశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement