కుప్పం రూరల్ : కుప్పం మండలం, పెద్దబంగారునత్తం చెరువులో భారీ ఎత్తున మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. నాలుగు రోజుల నుంచి పెద్ద ఎత్తున టిప్పర్లు, జేసీపీ యంత్రాలతో మట్టి తవ్వకాలు చేపడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కుప్పం పట్టణానికి నాలుగు కి.మీల దూరంలో పెద్దబంగారునత్తంలో చెరువులో నీరు పుష్కలంగా ఉంది. అక్రమార్కులు చెరువు చుట్టూ మట్టిని తరలిస్తున్నారు. అనుమతులు లేకుండానే ప్రైవేట్ లే అవుట్లకు మట్టి తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. భారీ వాహనాలు వేగంగా వెళ్తుండడంతో కట్ట ప్రమాదంలో పడుతోందని చెబుతున్నారు. నీరు ఉన్నా చెరువు చుట్టూ మట్టి తవ్వుతుండడంతో చెరువు పూడుకుపోయి భవిష్యత్తులో నీరు నిలువ ఉండేది కష్టమేనని అంటున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి మట్టి తరలింపుకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.


