విద్యుత్‌ షాక్‌తో అయ్యప్ప భక్తుడు మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ షాక్‌తో అయ్యప్ప భక్తుడు మృతి

Oct 29 2026 2:18 AM | Updated on Oct 29 2026 2:18 AM

● అభ్యర్థుల ప్రకటనపై హర్షం ● పోలింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి ● విజయానందరెడ్డి

శ్రీరంగరాజపురం: మండలంలో బుధవారం విద్యుత్‌ షాక్‌తో అయ్యప్ప భక్తుడు మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. పుల్లూరు పంచాయతీ కాపుకండ్రిగ గ్రామానికి చెందిన చెన్నకేశవరెడ్డి బుధవారం ఉదయం తన వ్యవసాయ పొలంలో మోటార్‌ ఆన్‌ చేయడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో స్టార్టర్‌కు విద్యుత్‌ సరఫరా కావడంతో చెన్నకేశవరెడ్డికి షాక్‌ కొట్టింది. తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ఆర్టీసీ డ్రైవర్‌కు రెండేళ్ల జైలు

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): అజాగ్రత్తగా బస్సు నడిపి వృద్ధురాలి మృతికి కారణమైన ఆర్టీసీ డ్రైవర్‌కు రెండేళ్ల జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా విధిస్తూ చిత్తూరు మూడవ అదనపు ద్వితీయ శ్రేణి మేజిస్ట్రేట్‌ కోర్టు తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళితే... తవణంపల్లి మండలం ఈచనేరి గ్రామానికి చెందిన గోవిందమ్మ (79) 2025 సెప్టెంబరు 8న ఉదయం గాంధీ సర్కిల్‌ వద్ద బస్సు దిగారు. అనంతరం ఆమె బస్సు ముందరి భాగం నుంచి రోడ్డు దాటేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని గమనించకుండా బంగారుపాళ్యం మండలం టేకుమంద గ్రామానికి చెందిన డ్రైవర్‌ నటరాజ బస్సును ముందుకు పోనిచ్చాడు. బస్సు ఢీకొని గోవిందమ్మ కిందపడిపోగా, ముందు చక్రాలు ఆమైపెకి ఎక్కి ముందుకు ఈడ్చుకెళ్లాయి. ఆమె శరీరమంతటా తీవ్ర రక్తగాయాలయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం తరలించే ప్రయత్నం చేసినప్పటికీ మధ్యాహ్నం 12.35 గంటల సమయంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై అప్పటి ట్రాఫిక్‌ సీఐ నిత్యబాబు సమగ్ర దర్యాప్తు జరిపి డ్రైవర్‌ నటరాజపై కేసు నమోదు చేసి న్యాయస్థానంలో అభియోగపత్రం దాఖలు చేశారు. మూడవ అదనపు ద్వితీయ శ్రేణి మేజిస్ట్రేట్‌ కోర్టులో కేసు విచారణ జరిగింది. నటరాజపై నేరం రుజువు కావడంతో జడ్జి రెండేళ్ల జైలు శిక్ష, రూ.10 జరిమానా విధించారు.

కలెక్టర్‌కు అభినందనలు

చిత్తూరు కార్పొరేషన్‌: విధి నిర్వహణలో నిజాయితీగా వ్యవహరిస్తున్న కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌కు అభినందనలని వైఎస్సార్‌ సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి తెలిపారు. స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ దాడులు చేసినా వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు బెదరలేదన్నారు. పార్టీని నమ్మి కష్ట కాలంలో అండగా ఉన్న వారి ధైర్యానికి హాట్సాప్‌ అని పేర్కొన్నారు. టీడీపీ ప్రజాప్రతినిధుల ఒత్తిడి మేరకు ఆర్వోలు, ఏఆర్వోలు దొంగ సంతకాలతో పలు ఎంపీటీసీ స్థానాలను ఏకగ్రీవం చేయాలని కుట్రలు చేశారని ఆరోపించారు. గతంలో జరిగిన తప్పును దృష్టి పెట్టుకొని కలెక్టర్‌ అలా జరగకుండా చూశారని తెలిపారు. సంబంధిత ఆర్వోలను తన చాంబర్‌కు పిలిపించి తప్పులు లేకుండా చూశారని పేర్కొన్నారు. మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంటకు ఎంపీటీసీ అభ్యర్థుల వివరాలను ప్రకటించారని వెల్లడించారు. 1న నగరపాలక, 5న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ ఉందన్నారు. ప్రతిపక్షంలో ఉన్న తమ పార్టీ నాయకులు ఎక్కడా తప్పులు చేయాలని అనుకోరని తెలిపారు. అధికార పార్టీ నాయకులు యథేచ్ఛగా దాడులు చేస్తున్నారని, వాటి నివారణకు కలెక్టర్‌, ఎస్పీ ప్రత్యేక దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు.

ఎన్నికల నేరాలపై కేసులు

సాక్షి, చిత్తూరు: జిల్లా పోలీసు యంత్రాంగం పనితీరులో స్వల్ప మార్పు కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చిత్తూరు నగరంలో చోటు చేసుకున్న రాక్షస క్రీడపై తాజాగా స్పందించారు. మూడు ఘటనలపై బుధరవారం వన్‌టౌన్‌ సీఐ చిన్న పెద్దయ్య కేసులు నమోదు చేశారు. పలు ఘటనలపై వైఎస్సార్‌ సీపీ కోర్టును ఆశ్రయించడం ఓవైపు, జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్న కలెక్టర్‌ వీటిపై సీరియస్‌ కావడంతో పోలీసులు కేసులు నమోదు చేయక తప్పలేదనే వాదన వినిపిస్తోంది.

● ఈ నెల 21వ తేదీన చిత్తూరు మునిసిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం లోపల వైఎస్సార్‌సీపీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల బీ–ఫారాలను టీడీపీ గుండాలు చించేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మునిసిపల్‌ కమిషనర్‌ నరసింహ ప్రసాద్‌ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

● ఈ నెల 21వ తేదీన రొంపిచెర్ల వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా చిత్తూరు జెడ్పీ కార్యాలయం వద్దకు నామినేషన్‌ దాఖలు చేయడానికి వచ్చిన సుష్మపై అక్కడున్న టీడీపీ గుండాలు అసభ్యంగా ప్రవర్తించి, ఆమె నామినేషన్‌ చింపేశారు. దీనిపై బాధితురాలి నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.

● వి.కోట నుంచి వైఎస్సార్‌ సీపీ తరఫున జెడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేయడానికి ఈనెల 21వ తేదీన జివి.ప్రకాష్‌ చిత్తూరుకు వచ్చారు. జెడ్పీ కార్యాలయం వద్ద టీడీపీ రౌడీలు ఈయనపై దాడిచేసి, నామినేషన్‌ పత్రాలు చింపేశారు. ఈ ఘటనపై కూడా కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement