నగరి: అధికార పార్టీ ఒత్తిళ్లు.. బెదిరింపులు.. రాజకీయ అడ్డంకులు.. అయినా వారి అడుగులు వెనక్కి పడలేదు. తాము ఎంచుకున్న రాజకీయ పార్టీపై అభిమానం తగ్గలేదు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పార్టీని బలోపేతం చేయాలన్న సంకల్పంతో ముందుకు సాగారు. ఒకరికి ఒకరు తోడుగా నిలుస్తూ, సతీసమేతంగా ఎన్నికల బరిలోకి దిగారు. నగరి మున్సిపల్ ఎన్నికల బరిలో వైఎస్సార్ సీపీ తరఫున పోటీకి సిద్ధమైన ఈ దంపతుల వ్యవహారం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సాధారణంగా ఎన్నికల సమయంలో అభ్యర్థులకు రాజకీయ ఒత్తిళ్లు, ప్రత్యర్థుల నుంచి సవాళ్లు ఎదురవుతుంటాయి. తమ రాజకీయ నిర్ణయానికి కట్టుబడి ఉండడం, ఎన్ని అడ్డంకులు ఎదురైనా పోటీ నుంచి వెనక్కి తగ్గకపోవడం ఈ దంపతుల ప్రత్యేకతగా నిలుస్తోంది. ఒకరు ఎన్నికల బరిలో నిలిస్తే మరొకరు అండగా ఉంటూ, ఇద్దరూ కలిసి రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించేందుకు సిద్ధమయ్యారు.
మనోధైర్యంతో ముందడుగు
మున్సిపల్ పరిధి కేవీపీఆర్ పేటలో రెండు వార్డుల్లో టీడీపీ నేతల ఒత్తిడి ఎక్కువగా ఉండడంతో పలువురు భయపడి పోటీకి ముందుకు రాలేదు. ఈ ప్రాంతం నుంచి వెనకడుగు వేసేదేలేదంటూ వైఎస్సార్ సీపీకి చెందిన దంపతులు ఎస్‌వి బాలాజి, జ్యోతి 21, 29 వార్డుల్లో అభ్యర్థులుగా బరిలో దిగారు. ప్రజలే అండగా నిలుస్తారని భావించి ప్రచారం చేస్తున్నారు.
మేమున్నామని..
సత్రవాడలో 23, 27 వార్డుల్లో పోటీ చేసేందుకు ఈవీ కన్నాయిరం, ఈకే బృంద దంపతులు వైఎస్సార్ సీపీ తరపున ధైర్యంగా ముందుకు వచ్చారు. ఇద్దరూ ప్రచారం చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. తమను కౌన్సిలర్లుగా గెలిపిస్తే చేసే మంచి పనులను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అడుగుతున్నారు. వారిని ప్రజలు కూడా ఆదరిస్తున్నారు.
భార్య ఏకగ్రీవం, భర్త పోటీలో..
మున్సిపల్ పరిధి కొత్తపేటకు చెందిన వైఎస్సార్ సీపీకి చెందిన మోహన్‌రాజ్, మణి మొయి దంపతులు 32, 15వ వార్డులకు కౌన్సిలర్ అభ్యర్థులుగా బరిలో దిగారు. ఈ అంశంపై గ్రామస్తులు చర్చించుకున్నారు. స్థానిక ఒప్పందం మేరకు ఒక సీటు వైఎస్సార్ సీపీకి, ఒక సీటు టీడీపీ ఇచ్చేలా తీర్మానం చేశారు. దీంతో మణిమొయి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా ఏకగ్రీవమయ్యారు. భర్త మోహన్‌రాజ్ 32వ వార్డులో పోటీలో ఉన్నారు.


