తిరుపతి తుడా : రాష్ట్ర ప్రభుత్వ జీవన్‌దాన్ పథకం కింద అందిన కిడ్నీలతో స్విమ్స్‌లో విజయవంతంగా ఇద్దరి రోగులకు మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించినట్లు డైరెక్టర్ డాక్టర్ జగదీష్ తెలిపారు. నెఫ్రాలజీ, యూరాలజీ, అనస్తీషియా విభాగాలతో పాటు అవయవ మార్పిడి సమన్వయ బృందం సమష్టి కృషితో శస్త్రచికిత్సలు పూర్తి చేశామని చెప్పారు. రోగులను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ నెల్లూరులోని అపోలో ఆస్పత్రిలో బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించబడిన దాత నుంచి సేకరించిన కిడ్నీలను స్విమ్స్‌కు కేటాయించారని వెల్లడించారు. ఈ కిడ్నీలను చిత్తూరు జిల్లా పెనుమూరు మండలానికి చెందిన 33 ఏళ్ల పురుషుడికి, తిరుపతి జిల్లా నాగలాపురం మండలానికి చెందిన 37 ఏళ్ల మహిళకు విజయవంతంగా కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స నిర్వహించామని వివరించారు.


