వారిని ఓటు బ్యాంకుగానే పరిగణిస్తున్న కూటమి కూటమిలోని మూడు పార్టీల్లో తార స్థాయికి చేరిన వర్గ విభేదాలు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: యాదవులకు కూటమి వెన్నుపోటు పొడిచింది. తిరుపతి మేయర్ పీఠంపై ఆశలు పెట్టి.. తీవ్రంగా అవమానించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన, టీడీపీలో ఒకే సామాజిక వర్గానికే పదవులు దక్కుతుండడంపై మిగిలిన వర్గాలు రగిలిపోతున్నాయి. టీడీపీలోని సీనియర్లకు విలువే లేదని పలువురు మండిపడుతున్నారు. ముఖ్యంగా పార్టీని వెంటబెట్టుకొని ఉన్న బీసీలు, అందులోనూ యాదవులకు అడుగడుగునా అవమానాలే ఎదురవుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో 2021లో మేయర్ ఎన్నికలు జరగగా ఆ పార్టీ బీసీలను అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టింది. ప్రస్తుత మేయర్ ఎన్నికల్లోనూ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు భూమన అభినయరెడ్డి బీసీలకే అవకాశం కల్పించారు. కానీ టీడీపీ బీసీల బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తోంది. యాదవులకే మేయర్ పదవి అని చెప్పుకుంటూ వచ్చిన సీఎం చంద్రబాబు బీసీలను మరోసారి వెన్నుపోటు పొడిచారని పలువురు మండిపడుతున్నారు. ఈ క్రమంలో టీడీపీలో వర్గ విభేదాలు సైతం తారస్థాయికి చేరాయి. కార్పొరేటర్లుగా తమ వర్గానికి సీట్లు ఇప్పించుకోలేకపోవడంతో పలువురు సీనియర్లు తీవ్ర అవమానంగా భావిస్తున్నారు.
బీజేపీ, జనసేనకు రెబల్స్ ఎఫెక్ట్
గుడ్డికన్నా మెల్ల మేలు అన్న చందాన 66 డివిజన్లలో బీజేపీకి ఐదు సీట్లు మాత్రమే కేటాయించారు. అందులో రెండు డివిజన్లలో రెబల్స్‌ను ఓవర్గం పెంచి పోషిస్తోంది. 21వ డివిజన్‌లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ పోటీ చేస్తుండగా టీడీపీలో ఓ వర్గం రెబల్ అభ్యర్థిగా దొడ్డారెడ్డి రామకృష్ణారెడ్డిని ప్రోత్సహిస్తున్నారు. ఈ వ్యవహారం పట్ల బీజేపీ నేతలు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. తమకు కేటాయించిన డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి రెబల్‌గా నిలబడడం పొత్తు ధర్మం కాదని వాపోతున్నారు. అలాగే 42వ డివిజన్‌లో టీడీపీ తరఫున గంజి సుధాకర్‌రెడ్డిని బరిలో దింపగా ఆ పార్టీ సీనియర్ నాయకుడు కంకణాల రజినీకాంత్ రెబల్ అభ్యర్థిగా ఉన్నారు. చివరి నిమిషం వరకు బీ–ఫాం ఇస్తారని భావించిన రజనీకాంత్ ఆ అవకాశం లేకపోవడంతో పార్టీలోని కొందరి అండదండలతో రెబల్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజు వరకు 47వ డివిజన్ జనసేనకు కేటాయించినట్లు ప్రకటించారు. అనూహ్యంగా టీడీపీ సీనియర్ నాయకుడు ఆర్సీ మునికృష్ణ తనకున్న పలుకుబడితో ఆ డివిజన్ ను టీడీపీకి కేటాయించుకునేలా చేశారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న జనసేన నేత టి.రాజేష్ ఆచారి రెబల్ అభ్యర్థిగా బరిలో నిలవాల్సి వచ్చింది. అలాగే మరో ఐదుగురు రెబల్ అభ్యర్థులుగా అదే డివిజన్లో పోటీలో ఉన్నారు. వీరందరి లక్ష్యం ఆర్సీ మునికృష్ణను ఓడించడమేనని బహిరంగంగా ప్రకటించారు. ఓ డివిజన్ లో కూటమికి చెందిన ప్రజాప్రతినిధి లక్షలు పుచ్చుకొని ఒకరికి హామీ ఇవ్వగా, తనకు కార్పొరేటర్ టికెట్టు కూడా ఇవ్వరా? అంటూ పార్టీ సీనియర్ నాయకురాలు ఆకేపాటి సుభాషిణి ఎమ్మెల్యే వర్గాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో చివరి నిమిషంలో 60వ డివిజన్ బీఫారాన్ని ఆకేపాటి సుభాషిని సాధించారు. రెబల్ అభ్యర్థిగా ఆదం సుధాకర్‌రెడ్డి జనసేనలోని ముఖ్యవర్గం అండదండలతో బరిలో ఉన్నారు. ఇలా పలు వార్డుల్లో సీనియర్లు, వారివర్గం నేతలు నామినేషన్ వేయగా తీవ్ర ఒత్తిళ్లు, హెచ్చరికలతో విత్‌డ్రా చేయించారు. అదేవిధంగా 3, 6, 26 డివిజన్లలోనూ కూటమిలోని పార్టీ నేతల మధ్య వర్గ విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఇదిలా ఉంటే.. టీడీపీ వ్యవహారంపై బీజేపీ, జనసేన నేతలు ఆగ్రహంగా ఉన్నారు. అదే విధంగా టీడీపీలోనే పలువురు నాయకులు అభ్యర్థుల ఎంపికలో తమను సంప్రదించలేదని గుర్రుగా ఉన్నారు.
మేయర్ పీఠం ఇస్తామని చెప్పి మోసం చేసిన టీడీపీ


