అత్యవసరంగా మార్చాల్సిన
125 కి.మీ పాత లైన్‌పై మాటెత్తని వైనం
రూ.450 కోట్లతో వేసిన అంచనా
చెత్తబుట్టకే పరిమితం
కేంద్రం నిధులు ఇస్తే గానీ చేయలేమని స్పష్టం చేసిన మంత్రి
నగరంలో శిథిలావస్థకు చేరుకుని పొంగిపొర్లుతున్న డ్రైనేజ్ వ్యవస్థ
తిరుపతి తుడా: 2014 ఎన్నికల్లో తిరుపతిని సింగపూర్‌ని చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ ఐదేళ్లలో తిరుపతి నగర అభివృద్ధికి చిల్లి గవ్వ విదల్చలేదు. 2024 ఎన్నికల్లోనూ తిరుపతి నగర అభివృద్ధికి చంద్రబాబుతో పాటు పవన్‌కళ్యాణ్ సైతం హామీల వర్షం కురిపించారు. అధికారంలోకి వచ్చి రెండన్నరేళ్లు పూర్తి కావస్తున్నా నగర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. తిరుపతి నగర అండర్ గ్రౌండ్ డ్రైనేజీపై పురపాలక శాఖ మంత్రి నారాయణ అసెంబ్లీలో ప్రస్తావించారు. తిరుపతిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మార్పు అనివార్యమని, అలానే కొత్త లైన్ ఏర్పాటు అవశ్యకమని చెబుతూనే కేంద్రం సహకరించకపోతే ఇప్పట్లో యూడీఎస్ లైన్ కోసం ఒక్క రూపాయి వెచ్చించే పరిస్థితులు లేవని తేల్చి చెప్పేశారు. అసెంబ్లీ సాక్షిగా తిరుపతి యూడీఎస్‌పై రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసిందని నగర ప్రజలు మండిపడుతున్నారు.
యూడీఎస్ మార్పు అనివార్యం
తిరుపతిలో 45 ఏళ్ల క్రితం నాటి ప్రజల అవసరానికి అనుగుణంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. తిరుపతి దినాభివృద్ధి చెందుతుండడంతో ప్రస్తుతం దాదాపుగా 4.5 లక్షల జనాభా కలిగిన నగరంగా నిలిచింది. ప్రతిరోజూ లక్ష మందికి పైగా యాత్రికులు రాకపోకలు సాగిస్తుంటారు. 50 వేల జనాభా అవసరాలకు ఏర్పాటు చేసిన యూడీఎస్ లైన్ ఇప్పుడు ఐదు లక్షలకు పైగా జనాభా భారాన్ని మోస్తోంది. దీంతో నగరంలో ఎక్కడ చూసినా యూడీఎస్ లైన్‌లు బ్లాస్ట్ అవుతున్నాయి. మ్యాన్ హోల్ ఓవర్ ఫ్లో తో నగరంలోని పలు వీధులు రొచ్చుగా మారుతున్నాయి. ఈ క్రమంలో యూడీఎస్ వ్యవస్థను కొత్తగా ఏర్పాటు చేసుకోవాల్సిందేనని అనేక సర్వేలు తేల్చాయి. 2014 –19లో చంద్రబాబు ప్రభుత్వం దీనిపై నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఈ క్రమంలో పాత యూడీఎస్ వ్యవస్థను తొలగించి కొత్తగా ఏర్పాటు చేసేందుకు గత ప్రభుత్వ హయాంలో 2023లో రూ.450 కోట్ల వ్యయంతో అంచనా వేశారు. ప్రతిపాదనలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారం పై చర్చలు జరిగేసరికి 2024 ఎన్నికలు వచ్చేశాయి.
నూతన యూడీఎస్ మాటేంటి
ప్రస్తుతం జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి నేతలు నగరంలో ఏర్పాటు చేయాల్సిన కొత్త యూడీఎస్ పరిస్థితిపై నోరు మెదపడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల కోడ్‌కు వారం రోజుల ముందు అర్భాటంగా రూ.3,222 కోట్లతో తిరుపతిని ఇంటిగ్రేటెడ్ టూరిజం టౌన్‌షిప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నమని ప్రగల్భాలు పలికారు. ఎన్నికల స్టంట్‌లో భాగమేనని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా కొన్ని డివిజన్లలో ప్రచారానికి వస్తున్న కూటమి నేతలను సీనియర్ సిటిజన్లు, స్థానిక మహిళలు నూతన యూడీఎస్‌పై ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.
కొత్త యూడీఎస్‌పై చేతులెత్తేసిన కూటమి ప్రభుత్వం
కొత్త యూడీఎస్ ఎప్పటికో
తిరుపతి నగరం మొత్తం పాత యూడీఎస్ స్థానంలో కొత్తగా యూడీఎస్ ఏర్పాటు చేసేందుకు రూ.450 కోట్లు అవసరమని నిర్ధారించారు. ఒకేసారి నగరమంతటా మార్చడం సాధ్యం కాదని భావించిన చంద్రబాబు ప్రభుత్వం 125 కి.మీ మేర అత్యవసరంగా మార్చాల్సిన అవసరం ఉందని ఏడాది క్రితం డీపీఆర్ సిద్ధం చేశారు. అప్పటి నుంచి ప్రభుత్వం వద్ద తిరుపతి యూడీఎస్ ఫైలు పెండింగ్‌లో ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి నారాయణ మాట్లాడుతూ తిరుపతిలో కొత్తగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టే ప్రతిపాదన తమ వద్దే లేదని చెప్పడంతో అధికారులు ముక్కున వేలేసుకున్నారు. 408.4 కి.మీ పరిధిలో యూడీఎస్ అవసరం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం 284.3 కి.మీ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఉందని, మరో 125 కి.మీ మేర కొత్త లైన్ వేయాలని లెక్కలు చెప్పారు. పాత లైన్‌లో అత్యవసరంగా 60 కి.మీ మేర మార్పు అనివార్యమని గుర్తించామని పేర్కొంటూ.. ఆపై చేతులెత్తేశారు. యూడీఎస్ పై ముందుకు వెళ్లాలంటే కేంద్ర ప్రభుత్వం సహకరించి నిధులు ఇస్తేనే సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు.


