శ్రీవారి దర్శనానికి 8 గంటలు | - | Sakshi
Sakshi News home page

శ్రీవారి దర్శనానికి 8 గంటలు

Oct 28 2026 1:00 AM | Updated on Oct 28 2026 1:00 AM

తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. సోమవారం అర్ధరాత్రి వరకు 69,697 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 25,781 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.64 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది.

సమిష్టి కృషితో నవరాత్రి బ్రహ్మోత్సవాలు విజయవంతం

తిరుపతి అన్నమయ్యసర్కిల్‌: సమిష్టి కృషితో తిరుమల శ్రీవారి వార్షిక, నవరాత్రి బ్రహ్మోత్సవాలు విజయవంతమయ్యాయని టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర తెలిపారు. మంగళవారం స్థానిక టీటీడీ పరిపాలనా భవనంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతోపాటు, స్వామివారి వాహన సేవలు, మూలమూర్తి దర్శనాన్ని సంతృప్తికరంగా అందించడంలో సమన్వయంతో పనిచేసిన ప్రతి ఒక్కరినీ ఆయన అభినందించారు. మార్కెటింగ్‌ విభాగం ముడిసరుకుల కొనుగోలుకు కనీసం 90 రోజుల ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో టీటీడీలోని అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవాలకు

పటిష్ట ఏర్పాట్లు

చంద్రగిరి: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ జేఈవో డాక్టర్‌ శరత్‌ అధికారులను ఆదేశించారు. డిసెంబర్‌ 5న అంకురార్పణతో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు డిసెంబర్‌ 6 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం తిరుచానూరులోని ఆలయం, వాహన మండపం, నాలుగు మాడ వీధులు, పార్కింగ్‌ ప్రాంతాలు, క్యూలైన్లు, పుష్కరిణి, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను ఆయన పరిశీలించారు. టీటీడీ సీఈ మనోహరం, డిప్యూటీ ఈవోలు హరీంద్రనాథ్‌, సెల్వం, ఎస్‌ఈ వేంకటేశ్వర్లు, వీజీవో గిరిధర పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement