తవణంపల్లె: ఆరోగ్యమే సమాజాభివృద్ధికి పునాది అని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సీ అన్నారు. మంగళవారం అరగొండ టోటల్ హెల్త్‌లో అరగొండ అపోలో హాస్పిటల్లో వెయ్యి మోకాళ్ల శస్త్ర చికిత్సలను విజయవంతంగా పూర్తిచేసిన సందర్భంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రతాప్ సీ రెడ్డి మాట్లాడుతూ అరగొండ తన ప్రస్థానానికి పునాది అని అన్నారు. ప్రతి భారతీయుడికి నాణ్యమైన అందుబాటు ధరల్లో వైద్యం అందాలన్నదే తన ఆకాంక్షగా పేర్కొన్నారు. వ్యాధులకు చికిత్స అందిచడంతోనే ఆరోగ్యం సంరక్షణ పూర్తి కాదని, ప్రజలు నివసించే పరిస్థితులు, పోషకాహారం, విద్య, జీవనోపాధి కూడా వారి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయన్నారు. పెద్ద నగరాలతో పాటు మారుమూల గ్రామాల్లో ఆరోగ్యవంతమైన భారతదేశ నిర్మాణం జరగాలన్నారు. గ్రామీణ స్రాంతాల్లో వైద్య సేవలతో పాటు సమాజ సమగ్ర అభివృద్ధికి బాటలు వేస్తూ అపోలో ఫౌండేషన్ చేపట్టిన టోటల్ హెల్త్ కేర్ కార్యక్రమం విశేష ఫలితాలు సాధిస్తోందని పేర్కొన్నారు. అరగొండలో 2000 సంవత్సరంలో 50 పడకల ఆస్పత్రిని స్థాపించి 26 ఏళ్లలో ఈ ఆస్పత్రి ద్వారా 1.67 లక్షలకు పైగా రోగులకు వైద్య సేవలు, 12 వేలకు పైగా శస్త్ర చికిత్సలు, తాజాగా వెయ్యికి పైగా మోకాళ్ల మార్పిడి శస్త్ర చికిత్సలను విజయవంతంగా చేసినట్లు వెల్లడించారు. మోకాళ్ల మార్పిడి శస్త్ర చికిత్సలు చేసిన వైద్యులు డాక్టర్ మదన్‌మోహన్ రెడ్డి, డాక్టర్ విజయ్‌కిషోర్ కొండ్రెడ్డి, డాక్టర్ కునాల్ పటేల్‌ను అభినందించారు. అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్‌పర్సన్ ప్రీతారెడ్డి మాట్లాడుతూ అరగొండ అపోలో హాస్పిటల్లో వైద్య సేవలకే పరిమితం కాకుండా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాసన, డాక్టర్ జయపాల్‌రెడ్డి ప్రసంగించారు.


