ఆటోను ఢీకొన్న కంటైనర్‌ లారీ | - | Sakshi
Sakshi News home page

ఆటోను ఢీకొన్న కంటైనర్‌ లారీ

Oct 28 2026 1:00 AM | Updated on Oct 28 2026 1:00 AM

● ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు ● అక్రమంగా నామినేషన్‌ తొలగించేశారు ● జేసీకి ఫిర్యాదు చేసిన ఎస్‌డీపీఐ పార్టీ జిల్లా అధ్యక్షుడు యూసుఫ్‌

● ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

గంగవరం: ఆటోను వెనుక నుంచి కంటైనర్‌ లారీ ఢీకొన్న ప్రమాదంలో ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. గంగవరం సమీపంలోని వైఎస్సార్‌ జంక్షన్‌ వద్ద పాల ప్యాకెట్ల లోడ్‌తో వెళ్తున్న ఆటోను వెనుక నుంచి కంటైనర్‌ లారో ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌ ఇమ్రాన్‌(30) తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు క్షతగాత్రుని చికిత్స నిమిత్తం పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు

చిత్తూరు కలెక్టరేట్‌ : ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ అక్రమంగా తమ పార్టీ అభ్యర్థి ఆసిఫ్‌ నామినేషన్‌ను తొలగించేశారని సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా జిల్లా అధ్యక్షుడు యూసుఫ్‌ విమర్శించారు. ఈ మేరకు ఆయన మంగళవారం జాయింట్‌ కలెక్టర్‌ ఆదర్శ్‌ రాజేంద్రన్‌ను కలసి ఫిర్యాదుపత్రం అందజేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. చిత్తూరు నగరంలో తమ పార్టీ 34వ వార్డు అభ్యర్థి ఆసిఫ్‌ నామినేషన్‌ పత్రాన్ని రిటర్నింగ్‌ అధికారి ఉదయ్‌ కుమార్‌ పరిశీలించి ఆమోదించారని తెలిపారు. అయితే, తమ పార్టీ అభ్యర్థి గానీ, ప్రతిపాదకుడు గానీ ఎలాంటి ఉపసంహరణ పత్రం ఇవ్వకపోయినా అక్రమంగా తొలగింపు చేశారన్నారు. ఎటువంటి కారణం చూపకుండా చివరి జాబితా నుంచి తమ పార్టీ అభ్యర్థి తొలగించడం దారుణమన్నారు. అక్టోబర్‌ 21 వ తేదీ సీసీటీవీ ఫుటేజ్‌, నామినేషన్‌ ఉపసంహరణ రిజిస్టర్‌, ఫారం 7 ను క్షుణ్ణంగా పరిశీలించి తమ పార్టీ అభ్యర్థికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన ఆర్వో ఉదయ్‌ కుమార్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు ఆసీఫ్‌, కరీం, తాజుద్ధీన్‌, రఫీ, సైఫుల్లా తదితరులు పాల్గొన్నారు.

గుర్తుతెలియని మహిళ ఆత్మహత్య

తిరుపతి క్రైం : నగరంలోని పీకే లేఔట్‌లో గుర్తుతెలియని మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం వెలుగుచూసింది. ఈస్ట్‌ పోలీస్‌స్టేషన్‌న్‌ పరిధిలోని ఆంజనేయస్వామి ఆలయం వెనుకవైపు ఉన్న లక్ష్మీనిలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. సదరు మహిళకు సుమారు 35 నుంచి 45 ఏళ్ల వయసు ఉంటుందని అంచనా. నివాసంలోని మేడపైకి వెళ్లే నిచ్చెనకు చీరతో ఉరివేసుకుని మృతి చెందినట్లు గుర్తించారు. మృతురాలు ఆకుపచ్చ రంగు డిజైన్‌ బ్లౌజ్‌, నల్లటి లంగా, ఆకుపచ్చ రంగు డిజైన్‌ చీర ధరించి ఉంది. ఆమె రెండు చేతుల ముంజేతులపై ప్రత్యేకమైన ఆకారాలతో పచ్చబొట్లు ఉన్నాయి. రెండు చేతులకు గాజులు, ముక్కుకు ముక్కుపుడక ధరించి ఉంది. ఆమె ఆచూకీ తెలిసిన వారు తిరుపతి ఈస్ట్‌ పోలీసులను సంప్రదించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement