కుప్పంరూరల్: టెక్నాలజీ రంగంలో ఎప్పటికప్పుడు చోటుచేసుకుంటున్న పరిణామాలను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆర్‌జేడీ నిర్మల్‌కుమార్ అన్నారు. మంగళవారం కుప్పం వైసీ జేమ్స్ ఎన్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. ఏఐ వంటి పోటీ ప్రపంచంలో చోటు చేసుకుంటున్న సాంకేతికతను ఎప్పటికప్పుడు విద్యార్థులు అందుకోవాలన్నారు. ప్రస్తుత పరిణామాలకు అనుగుణంగా విద్యాభ్యాసం సాగాలని సూచించారు. విద్యార్థులు ఉద్యోగాలు సాధించేందుకు చదువుకోవడం పాత పద్ధతి అని , ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వడానికి చదువుకోవడం ప్రారంభించారని చెప్పారు. అనంతరం ముంబయి ఐఐటీ ఈ యాత్ర పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులు వెంకట్‌తేజ్‌నాయక్, తన్వీర్‌భాషాలను, అదే విధంగా 1000కి 996 మార్కులు సాధించిన విక్రమ్‌ను అభినందించారు. తరువాత కళాశాల ఆవరణలో పచ్చదనం పెంపుకోసం అధ్యాపకులతో కలిసి చెట్లు నాటారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జి. రామకృష్ణారావు, అధ్యాపకులు విద్యార్థులు ఉన్నారు.


