యువత సంకల్పంతోనే లక్ష్యం సాధ్యం | - | Sakshi
Sakshi News home page

యువత సంకల్పంతోనే లక్ష్యం సాధ్యం

Oct 27 2026 1:44 AM | Updated on Oct 27 2026 1:44 AM

● అపోలో గ్రూప్‌ వ్యవస్థాపక చైర్మన్‌ డాక్టర్‌ ప్రతాప్‌ సీ రెడ్డి

● అపోలో గ్రూప్‌ వ్యవస్థాపక చైర్మన్‌ డాక్టర్‌ ప్రతాప్‌ సీ రెడ్డి

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): భవిష్యత్తులో భారత్‌ ప్రపంచ ఆరోగ్య సంరక్షణ రంగానికి కేంద్రంగా అవతరించగలదని అపోలో హాస్పిటల్స్‌ వ్యవస్థాపక చైర్మన్‌ డాక్టర్‌ ప్రతాప్‌ సీ రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. చిత్తూరు నగరంలోని అపోలో నాలెడ్జ్‌ సిటీలో మొదటి సంవత్సరం విద్యార్థులను ఉద్దేశించి ఆయన సోమవారం ప్రేరణాత్మక ప్రసంగం చేశారు. నేటి విద్యార్థులే రేపటి భారతదేశ భవిష్యత్తును తీర్చిదిద్దే నాయకులని పేర్కొంటూ, విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో తమ లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు. ఆరోగ్య సంరక్షణ, సమాచార సాంకేతికత, కృత్రిమ మేధ (ఏఐ), ఇంజినీరింగ్‌ రంగాల్లో వస్తున్న మార్పులను అందిపుచ్చుకుని, నూతన ఆవిష్కరణల దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అపోలో యూనివర్సిటీ ఉపకులపతి డా. నితిన్‌ ఎం. నాగార్కర్‌, సెంటమ్‌ గ్రూప్‌ చైర్మన్‌ అండ్‌ సీఈవో డాక్టర్‌ అప్పారావు మల్లవరపు, యూనిట్‌ హెడ్‌ ఎస్‌. బాలరాజ్‌, డీన్లు, విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

చేప పిల్లల విడుదల

నాగలాపురం: అరణియార్‌ రిజర్వాయర్‌లో 10.11 లక్షల చేప పిల్లలను విడుదల చేశారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద సోమవారం అరణియార్‌ ఉత్పత్తి కేంద్రం నుంచి తీసుకొచ్చిన చేప పిల్లలను పిచ్చాటూరు అరణియార్‌ ప్రాజెక్టులో వదిలారు. జిల్లా మత్స్యశాఖ అధికారి జి.రాజేష్‌, తహసీల్దార్‌ చంద్రబాబు, తదిరతులు పాల్గొన్నారు.

లంచం కేసులో

వీఆర్వోకు మూడేళ్ల జైలు

నెల్లూరు(లీగల్‌): రైతు పొలానికి సంబంధించి టైటిల్‌ డీడ్‌, పాస్‌బుక్‌ ఇవ్వడానికి లంచం తీసుకున్నాడని నమోదైన కేసులో నేరం రుజువు కావడంతో చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం లక్కనపల్లి గ్రామ అప్పటి వీఆర్వో సీహెచ్‌ రామనారాయణకు శిక్ష పడింది. మూడేళ్ల జైలు, రూ.10 వేలు జరిమానా విధిస్తూ నెల్లూరు ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జి.గీత సోమవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ కథనం మేరకు.. బైరెడ్డిపల్లి మండలం రామనపల్లి గ్రామానికి చెందిన కంపనగిరి సుబ్రహ్మణ్యం లక్కనపల్లి పంచాయతీలో 2.03 ఎకరాల పొలం కొనుగోలు చేశాడు. దీనికి సంబంధించి టైటిల్‌ డీడ్‌, పాస్‌బుక్‌ మంజూరు కోసం 2013 మార్చిలో మీ–సేవ ద్వారా రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. అనంతరం లక్కనపల్లి పంచాయతీ వీఆర్వో రామనారాయణను టైటిల్‌ డీడ్‌, పాస్‌బుక్‌ ఇవ్వాలని సుబ్రహ్మణ్యం పలుమార్లు అడిగారు. వాటిని మంజూరు చేయడానికి వీఆర్వో రూ.15 వేలు లంచం డిమాండ్‌ చేశాడు. చివరికి రూ.10 వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. లంచం ఇవ్వడం ఇష్టం లేని సుబ్రహ్మణ్యం 2013 సంవత్సరం ఆగస్ట్‌ 16వ తేదీన తిరుపతి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. మరుసటి రోజు పలమనేరులోని మానస హోటల్‌ సమీపంలో ఉన్న రామనారాయణ వద్దకు సుబ్రహ్మణ్యం వెళ్లి లంచం డబ్బులు ఇస్తూ ఉండగా ఏసీబీ అధికారులు దాడిచేసి సాక్ష్యాధారాలతో అరెస్ట్‌ చేశారు. దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. కేసు విచారణలో నేరం రుజువు కావడంతో పైమేరకు న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ త్రివేణి వాదించారు.

ఐఏఎస్‌ అధికారికి

క్షేత్రస్థాయి శిక్షణ

యాదమరి: స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో 2025 ఆల్‌ ఇండియా సర్వీసెస్‌ బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి బి.వెంకటేష్‌కు సొమవారం క్షేత్రస్థాయి శిక్షణ ప్రారంభమయ్యింది. నవంబర్‌ 15 వరకు జరిగే ఈ శిక్షణలో ఆయన పాల్గొననున్నారు. శిక్షణలో భాగంగా మండల స్థాయి పంచాయతీలు, ఎన్నికై న ప్రజాప్రతినిధుల పనితీరు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాల అమలు తీరును ఆయన స్వయంగా పరిశీలించనున్నారు. అలాగే వివిధ శాఖల మధ్య సమన్వయం, గ్రామ పంచాయతీల్లోని క్షేత్రస్థాయి పాలనా విధానాలపై ఆయన ప్రత్యేక అధ్యయనం చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement