స్థానిక ఎన్నికల వేళ పరిస్థితులు చూస్తే భయమేస్తోంది
తిరుపతి అర్బన్: ‘ఎన్నికల డ్యూటీలు చేస్తాం సార్.. అయితే ఉద్యోగులకు రక్షణ మాటేంటి..?.. జిల్లాలో జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే ఆందోళన కలుగుతోంది. ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు సరైన భద్రత కల్పించండి’ అంటూ ఏపీ జేఏసీ జిల్లా చైర్మన్, ఎన్‌జీవోల జిల్లా అధ్యక్షుడు ఎస్.సురేష్‌బాబు డిమాండ్ చేశారు. సోమవారం ఆయన జేఏసీ నేతలతో కలసి కలెక్టరేట్‌లో డీఆర్వో నరసింహులుకు వినతిపత్రాన్ని అందించారు. వారు మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల వద్ద రాజకీయ నాయకులు, వారి అనుచరుల అనధికార ప్రవేశాన్ని నియంత్రించాలని డిమాండ్ చేశారు. పరిశీలన పేరుతో పోలింగ్ కేంద్రంలో సిబ్బందిపై తీవ్రమైన ఒత్తిడి చేయడం, దురుసుగా మాట్లాడడం, విధులకు ఆటంకం కలిగించడం వంటి చర్యలను అరికట్టాలని సూచించారు. ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు, సిబ్బందికి పూర్తి భద్రత కల్పించాలని కోరారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించాలని కోరారు. అనవసర గుంపులు, గుమికూడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. జిల్లాలో జరుగుతున్న దాడులను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగుల సరైన రక్షణ కల్పించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఓటర్లు ఎలాంటి భయం, ఒత్తిడి లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులను ఎన్నికల విధుల నుంచి మినహాయించాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీ జేఏసీ తిరుపతి జిల్లా కార్యదర్శి ఎస్. వెంకటముని, పూర్వ ఉమ్మడి చిత్తూరు జిల్లా ఏపీ జేఏసీ సెక్రటరీ జనరల్ ముత్యాలరెడ్డి, జేఏసీ నేతలు గిరిబాబు, వై.మధు, లలిత్, మధుసూదన్, కవిత తదితరులు పాల్గొన్నారు.


